Thursday, December 12, 2024

AP | మదనపల్లిలో భూ బాగోతం.. తహసీల్దార్ ఎదుటే గొంతు కోసుకొన్న ఎక్స్ ఆర్మీ మెన్

( ఆంధ్రపభ, మదనపల్లె) : పక్షవాతంతో అనారోగ్యం బారిన పడిన మాజీ సైనికుడు తన చావుతోనైనా మరొకరికి న్యాయం జరుగుతుందన్న ఆవేదనతో తహసీల్దార్ ఎదుటే గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం మదనపల్లె పట్టణంలో సంచలనం రేపింది.

మదనపల్లె పట్టణం భువనేశ్వరినగర్‌కు చెందిన ఆర్‌.రామచంద్ర (63) దేశ భద్రత కోసం 1983లో సైన్యంలో చేరి సుమారు 22 ఏళ్లు సైన్యంలో పనిచేసి 2005లో పదవీ విరమణ పొందారు. ప్రభుత్వం మాజీ సైనికులకు కొంత భూమిని కేటాయించడంలో భాగంగా రామచంద్రకు మదనపల్లి మండలం, వెంకప్పకోట గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 89 లో 2.30 ఎకరాల భూమిని కేటాయించి పట్టా, పాసు బుక్కులు ఇచ్చింది.

ఆ భూమిలో కొన్నాళ్లపాటు సాగు చేసుకున్న రామచంద్ర.. 2020లో పక్షవాతం రావడంతో వైద్య చికిత్సలు చేయించుకుంటూ ఇంటిపట్టునే ఉన్నాడు. అయితే, 2023 మార్చిలో భూమిని ఆన్లైన్ నుంచి తప్పించి, 21బి లేకుండా చేశారు. అనంతరం చదును చేసేందుకు భూమి వద్దకు వెళ్లిన మాజీ సైనికుడిని రెవెన్యూ అధికారులు అడ్డుకుని భూమి నీది కాదని వెనక్కి పంపించారు.

దీంతో ఆ మాజీ సైనికుడు అధికారుల చుట్టూ పలు దఫాలుగా తిరిగాడు. సబ్ కలెక్టర్, తాహసీల్దార్ ల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో సోమవారం మదనపల్లె తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన మాజీ సైనికుడు రామచంద్ర తాహసీల్దార్ ఖాజాబీని నిలదీశారు.

తనకు పని జరగందే ఇక్కడ నుంచి వెళ్లనని, చావనైనా చస్తానని తెగేసి చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఒకటో పట్టణ ఎస్ఐ శివకుమార్ సిబ్బందితో తహసీల్దారు కార్యాలయానికి చేరుకోవడంతో తన పని చేయకపోగా పోలీసులను పిలిపిస్తారా అని వెంట తెచ్చుకున్న బ్లేడు, కత్తితో అందరి ముందు గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

- Advertisement -

అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాధితున్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ఈ విషయమై ఎస్ఐ శివకుమార్ ను వివరణ అడగా చాలా సున్నితమైన సమస్య అని, పై అధికారులు దృష్టికి తీసుకు వెళ్తామని ఆ తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయిస్తామన్నారు.

అనంతరం తహశీల్దారు ఖాజాబీని వివరణ కోరగా 2023లో భూమి సర్వే చేసినప్పుడు భూమిని ఎవరైతే చూపారో వారి పేరునే భూమి వివరాల మాత్రమే ఆన్లైన్ లో చేర్చినట్టు తెలిపారు. ఆ సమయంలో వీరు అందుబాటులో లేక భూమిని చూపకపోవడంతో ఆ భూమిని బ్లాక్ లిస్టులో పెట్టారని తెలిపారు. మాజీ సైనికుడి పెట్టుకున్న అర్జీ ప్రకారం తిరిగి ఆ భూమిని ఇప్పించడానికి లేదా మరో ప్రత్యామ్నాయ మార్గం చూపడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఈ లోపే ఆయన కార్యాలయానికి వచ్చి ఇలా చేశాడని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement