Thursday, October 31, 2024

ఏడాది క్రితం చంపేసి పాతేశారు.. మ‌హిళ మ‌ర్డ‌ర్ కేసులో దొరికిన ఆధారాలు..

సుండుపల్లె, (అన్మమయ్య) ప్రభ న్యూస్‌ : మహిళను తమ కుటుంబసభ్యులే ఏడాది క్రితం చంపేసి గుట్టుచప్పుడు కాకుండా తమ వ్యవసాయ పొలం సమీపంలో పాతేసిన సంఘటన అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దృష్టి సారించడంతో సుండుపల్లె మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సుండుపల్లె మండలం మడితాడు పంచాయతీ వానరాచపల్లెకు చెందిన బానే వెంకటరమణ సమీపంలోని ఉప్పరపల్లెకు చెందిన అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య ఇటీవల కాలంలో సయోధ్య కుదరలేదు. వెంకటరమణ పెద్ద భార్య క్రిష్ణమ్మ ఆమె చెల్లెలు శాంతమ్మ ఇద్దరు ఇంట్లో అప్పుడప్పుడు గొడవపడేవారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మే చివరలో అక్కచెల్లెళ్ల మధ్య ఏర్పడిన తగవు చివరకు క్రిష్ణమ్మ మృతికి కారణమైనది. అదే సమయంలో క్రిష్ణమ్మ(58)ను భర్త వెంకటరమణ, కుమారులు, చెల్లెలు చంపేసి తమ వ్యవసాయ పొలం సమీపంలోని ఈడిగోనికుంట కట్ట పక్కన ఉన్న చిన్ననీటి గుంత వద్ద పాతేశారు.

అయితే మృతురాలు క్రిష్ణమ్మ అక్క సరస్వతమ్మ సోదరుడు బాలక్రిష్ణలు అప్పటి నుంచి భర్త కుమారులపై అనుమానం వ్యక్తం చేస్తూ సుండుపల్లె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసును ఛేదించడానికి చేసిన ప్రయత్నాలు పలించలేదు. దీంతో మృతురాలు క్రిష్ణమ్మ అక్క సరస్వతమ్మ, తమ్ముడు బాలక్రిష్ణ పట్టువిడవని విక్రమార్కుల వలే వారం రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫిర్యాదు చేస్తూ తమ ఆవేదన వెల్లిబుచ్చుకున్నారు. దీంతో ఎస్పీ ఈ కేసును ఛేదించాలని కింది స్థాయి పోలీసులను ఆదేశించారు. వెంటనే రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప, సుండుపల్లె ఎస్‌ఐ నరసింహుడులు ఫిర్యాదు ఆధారంగా శైలిలో అనుమానితులను విచారించగా నిందితులు తమ క్రూరచర్యను ఒప్పుకున్నారు. దీంతో సీఐ లింగప్ప ఆధ్వర్యంలో మంగళవారం క్రిష్ణమ్మ మృతదేహాన్ని వెలికితీసి అక్కడే తహసీల్దార్‌ జీవన్‌ చంద్రశేఖర్‌ ఎదుట పంచనామా నిర్వహించి కడప రిమ్స్‌ వైద్యులు డాక్టర్‌ సుధాకర్‌చే పోస్టుమార్టం పూర్తి చేయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement