ఏపీలో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వైసీపీ సిద్ధం పేరుతో సభలను నిర్వహిస్తూ దూసుకుడును ప్రదర్శిస్తుంది. ఎలాగైనా 175కు 175సీట్లను గెలుచుకునేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇటు టీడీపీ-జనసేన కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ టీడీపీ-జనసేవ ఉమ్మడి బహిరంగ సభను నిర్వహిస్తుంది.
ఇప్పటికే ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేశాయి రెండు పార్టీలు. ఇప్పుడు తాడేపల్లిగూడెం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అయ్యారు. టీడీపీ, జనసేన ఇప్పటికే విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా… ఇప్పుడు ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగే సభకు 6 లక్షల మంది హజరవుతారనే అంచనా వేస్తున్నారు.. దానికి తగ్గట్టుగా సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేశాయి.. ఇక, ఈ సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఈ వేదికపై నుంచి నాయకులకు, పార్టీ శ్రేణులకు ఎన్నికలపై దిశానిర్ధేశం చేస్తారు.
ఇక, టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న జెండా సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించబోతున్న ఈసభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు మరో 500 మంది నాయకులు వేదికను పంచుకోబోతున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 6 లక్షల మంది జనం ఈ సభకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణం చుట్టు భారీ ఎల్ఈడీలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఇరు పార్టీల అధినేతలు ఇదే వేదికపై నుంచి పూరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్ ఏవిధంగా పనిచేయాలి.. టిక్కెట్ల కేటాయింపు తర్వాత ఇరు పార్టీల ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలనే విధంగా అధినేతలు పార్టీ శ్రేణులకు వివరించనున్నారు.
టీడీపీ – జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభకు.. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో ఎలంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. దాదాపు వెయ్యి మంది పోలీసులు సభ సజావుగా సాగేవిధంగా రక్షణ చర్యలు తీసుకోనున్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుకు విడివిడిగా రెండు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ మొదలు కానున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో ఇరుపార్టీల నేతలు తలామునకలై ఉన్నారు. ఇక, సభాప్రాంగణం పరిసర ప్రాంతాలు, తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోటీసులు.. కొన్ని చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు.