అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రస్ధాయి స్వాతంత్య్ర వేడుకలకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర పోలీసుశాఖ కీలకంగా నిర్వహించే ఈ వేడుకలకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి ఈ రోజు (ఆదివారం) పర్యవేక్షించారు. ఇందుకుగాను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (సోమవారం) జాతీయ పతాకావిష్కరణగావించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పరేడ్ నిర్వహించనున్న సాయుధ దళాల నుండి సీఎం గౌరవ వందనం స్వీకరిస్తారు.
ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు స్టేడియంలో సిద్దంగా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే తేనీటి విందు (ఎట్ హోమ్) కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఇతర ప్రముఖులు హాజరవుతారు.