విజయవాడ, ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ పాలి-టె-క్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపి పాలిసెట్ -2022)ను రాష్ట్రవ్యాప్తంగా మే 29న నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తైనట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా. పోలా భాస్కర్ తెలిపారు. పాలిసెట్ -2022 నిర్వహణకు రాష్ట్రంలో 26 జిల్లాలో 52 సహాయ కేంద్రాలు, 404 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు- చేశామన్నారు. మొత్తం 1,37,371 మంది విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి పాలి-టె-క్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందడానికి పరీక్షకు నమోదు చేసుకున్నారన్నారు. పరీక్షా ఫలితాలను 10 రోజులలో ప్రకటిస్తామని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నాడు పోలా భాస్కర్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఈ సందర్భంగా డా. పోలా భాస్కర్ మాట్లాడుతూ.. గతంలో కంటే విద్యార్ధుల నమోదు సంఖ్య పెరిగిందని, 2020లో 88,484 మంది, 2021లో 74,884 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 2022లో ఒక లక్షా 37వేల 371 మంది నమోదు చేసుకున్నారన్నారు.
విద్యార్దులను ఉదయం 10 గంటల నుండి పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తామని, నిర్ణీత సమయం ఉదయం 11 గ ంటల తరువాత పరీక్షా కేంద్రంలోనికి ఏ విద్యార్ధిని అనుమతించరని తెలిపారు. కొన్ని హాల్ టికెట్లలో ఫోటోలు బాగా పాతవిగా ఉండటంతో ప్రతి విద్యార్ధి తనతో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం 84 గవర్నమెంట్, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు 29 బ్రాంచ్ లలో 3 సంవత్సరముల డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ నందు రూ.4,700 లు, ప్రైవేట్ పాలి-టె-క్నిక్ నందు రూ.25,000 లు ఫీజులు నిర్ణయించామన్నారు. 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17,004 సీట్లు-, 175 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 53,565 సీట్లు… మొత్తం 70,569 సీట్లు ఉన్నాయన్నారు. విద్యార్థి ఎక్కడ చేరినప్పటికీ ప్రభుత్వ పథకాలు అన్నీ అర్హులైన ప్రతి విద్యార్థికి వర్తిస్తాయన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంజినీరింగ్ వారికంటే పాలి-టె-క్నిక్ వారికే ఎక్కువ అవకాశాలున్నాయన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..