కుప్పం ప్రజలను నాకు దూరం చేసే చేష్టలను సహించాను
కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా దగ్గరి బంధువులే
కుప్పం అభివృద్ధి నాతోనే సాధ్యమని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం
ఎవ్వరికి దక్కని ఖ్యాతిని కుప్పం ప్రజలు నాకు కట్టబెట్టారు
ముఖ్య నాయకుల సమావేశంలో సీఎం చంద్రబాబు
కుప్పం, జూన్ 26 (ప్రభ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన నిమిత్తం రెండు రోజుల పాటు విస్తృతంగా సమావేశాలు, బహిరంగ సభ, అధికారులతో సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కుప్పం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో సుధీర్ఘంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కుప్పం ప్రజలతో తనకున్న అనుబంధం గుర్తు చేస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చిన నాపై వారి చల్లని దీవెనలు ఇస్తూ నన్ను అభిమానిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. తనను కుప్పం నియోజకవర్గ ప్రజలకు దూరం చేసే చేష్టలను తాను సహించేది లేదని గట్టిగా చెప్పారు. గత ఎన్నికల ఫలితాలు కొంత నిరాశ కల్గించిందని రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి వచ్చిన స్పందన కుప్పంలోకి తీసుకు రావడంలో మీరు కొంత వెనుక బడ్డారని తెలిపారు.
కొన్నిచోట్ల ఎవ్వరూ ఊహించని రీతిలో మెజారిటీ రావడం జరిగిందన్నారు. కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటని మరింత బలోపేతం కావడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుప్పం నియోజకవర్గం ఉన్న రెండు లక్షల ఇరవై వేల మంది తనకు దగ్గరి బంధువులే అని తెలిపారు. వారిలో కొంతమంది తప్పితే తక్కిన వారందరూ కుప్పం అభివృద్ధి నాతోనే సాధ్యమని భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఎవ్వరికి దక్కని ఖ్యాతిని కుప్పం నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చారని, వారికి ఎంత సేవ చేసినా తక్కువే అన్నారు.
మీరు ప్రజలతో మమేకం కావాలని, వారి కష్ట సుఖాల్లో భాగస్వామ్యంగా ఉండి పార్టీకి, ప్రభుత్వంకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కుప్పం అభివృద్ధిపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, ఈ దఫా మొదటి సీజన్ లోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తానన్నారు. వైకాపా ప్రభుత్వం హయాంలో కుప్పం నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించే విషయం గురించి తనకు పూర్తి సమాచారం ఉందన్నారు. కుప్పం నియోజకవర్గం గతంలో ఉన్న విధంగా ప్రశాంతంగా, అభివృద్ధి పైన శ్రద్ధ వహించి ప్రభుత్వంపైన ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా మీరు అందరూ ఒక్క తాటిపై ఉండాలన్నారు.