Friday, November 22, 2024

AP: ప్రతి బుధ, శుక్రవారాల్లో “జగనన్నకు చెబుదాం”- కలెక్టర్

మచిలీపట్నం, సెప్టెంబర్ 8 : ప్రజల సమస్యలు పరిష్కరించి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి స్థాయిని పెంపొందించేందుకు “జగనన్నకు చెబుదాం”కార్యక్రమం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి బుధవారం, శుక్రవారాలలో ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మచిలీపట్నం జిల్లా కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు ప్రతి బుధవారం శుక్రవారంలలో మండల కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు నెంబరు 17 75 జారీ చేసిందన్నారు.


సెప్టెంబర్ నెలలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం షెడ్యూల్ కలెక్టర్ వివరించారు. సెప్టెంబర్ 13వ తేదీన గన్నవరం నియోజకవర్గంలో ఉంగుటూరు, 15వ తేదీ అవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు, 20వ తేదీ పామర్రు నియోజకవర్గంలో మొవ్వ, 22వ తేదీ పెనమలూరు నియోజకవర్గంలో ఉయ్యూరు, 27వ తేదీ గుడివాడ నియోజకవర్గంలో నందివాడ, 29వ తేదీ పెడన నియోజకవర్గంలో కృత్తివెన్ను, అక్టోబర్ 4వ తేదీ మచిలీపట్నంలో ఆయా మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రజల నుండి అందిన అర్జీలు శాఖల వారీగా క్రోడీకరించి, మధ్యాహ్నం నుంచి ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, వచ్చిన అర్జీలపై పరిష్కార చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు.


మండల కేంద్రాల్లో నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జిల్లా అధికారులు మండలంలోనే ఉండి వచ్చిన అర్జీలపై పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా మండలాలకు చెందిన ప్రజలు ఈ విషయం గమనించి, వారి మండలాల్లో జగనన్నకు చెబుదాం నిర్వహించే తేదీల్లో వారి సమస్యలపై అర్జీలు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం క్రింద జిల్లాలో ఇప్పటివరకు అందిన 6,800 అర్జీలలో 5,110 పరిష్కరించినట్లు, మిగతావి వివిధ పరిష్కార దశల్లో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి.శివ నారాయణరెడ్డి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement