న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివేకానంద హత్య కేసును ఆయన కూతురి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఇద్దరూ ఒకటేనని, ఈ పరిస్థితుల్లో కేసు తెలంగాణకు బదిలీ చేసినప్పటికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం సొంత బాబాయి వివేకా హత్య కేసులోనే న్యాయం దొరకడం లేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి జగన్ సిగ్గుతో తలదించుకోవాలని ఆదినారాయణ వ్యాఖ్యానించారు. జగన్ సీఎం పదవికి రాజీనామా చేస్తే సరిపోదని, మొత్తంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం కాక, భారతి రాజ్యాంగం నడుస్తోందని ఎద్దేవా చేశారు. వివేకాపై గొడ్డలి వేటు గుండెపోటుగా ఎలా మారిందని ప్రశ్నించారు. హత్య జరిగిన వెంటనే గుండెపోటు అంటూ మీడియాలో మాట్లాడిన నేతలతో పాటు వైఎస్ కుటుంబంలోని అందరినీ సీబీఐ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు.
బీజేపీ-జగన్ ఒక్కటి కాదని స్పష్టం చేసిన ఆదినారాయణ, ఇలాంటి కేసుల్లో ఏమాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు హత్య వెనుక కుట్ర, ఆ తర్వాత ఆధారాలు చెరిపేసే ప్రయత్నాలపై లోతుగా దర్యాప్తు జరపాలని అన్నారు. ‘వై నాట్ 175’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంపై ఆదినారాయణ రెడ్డి స్పందించారు. రాష్ట్రానికి ఏం చేశారని మీకు ప్రజలు175 సీట్లు కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు.