Tuesday, November 26, 2024

ఇక మన సెల్‌ఫోన్‌ పోయినా భద్రమే.. అందుబాటులోకి ఎల్‌ఎంటిఎస్‌ యాప్‌

అమరావతి, ఆంధ్రప్రభ : సెల్‌ఫోన్‌.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇదొక అరుదైన.. అమూల్యమైన వస్తువు. ఇప్పుడది లక్షల్లో కూడా ధర పలికే విలువైన సాధనం. బంగారం, కారు, బైక్‌, సెల్‌ఫోన్‌ ఇలా ఏదీ పోయినా ఖరీదైనవి కనుక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే. అయితే సెల్‌ఫోన్‌ విషయంలో ప్రారంభంలో కేసులు నమోదు చేసి దొంగలను పట్టుకుని రికవరీ చేసేవారు. రానురాను పనిభారం, ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య పెరుగుతుండటంతో కేసులు నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. ‘ముందుగా మీసేవా కేం ద్రాలకు వెళ్ళి చలానా చెల్లించి వివరాలు చెప్పాలి. అక్కడ ఇచ్చిన రశీదు పోలీసు స్టేషన్‌లో ఇవ్వాలి.. తర్వాత ఫోన్‌ చేస్తాం అప్పుడు రండి’ నా సెల్‌ఫోన్‌ పోయిందంటూ ఫిర్యాది పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తే అక్కడ లభించే సమాధానం ఇదే. దీంతో చాలారోజులు సెల్‌ఫోన్‌ చోరీలకు సంబంధించిన ఫిర్యాదులకు పరిష్కారం లేకుండాపోయింది. అయితే ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. ఎంత ఖరీదైన సెల్‌ఫోన్‌ అయినా సరే చోరీకి గురైనా.. పోయినా బాధితుని నుంచి ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేయడం, దర్యాప్తు వేగవంతం చేయడం, నిందితుడిని కనిపెట్టి అరెస్టు చేయడం , సెల్‌ రికవరీ చేసి ఫిర్యాదికి అందించడం ఇలా రోజుల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తవుతోంది.

ఇందుకోసం పోలీసుశాఖ అధునాతన సాంకేతిక పరిఙ్ఞానం వినియోగిస్తోంది. దీని ఆధారంగా పోయిన మొబైల్‌ ఫోన్‌ను కనిపెట్టేందుకు ‘లాస్డ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సర్వీస్‌'(ఎల్‌ఎంటిఎస్‌) అనే యాప్‌ను అందుబాటు-లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ యాప్‌ను జిల్లాల వారీగా వినియోగంలోకి తీసుకువస్తున్నారు. ఇటీవల కాలంలో వేల సంఖ్యలో సెల్‌ఫోన్లు చేధించి రికవరీ చేసిన వివిధ జిల్లాల యంత్రాంగ ఫిర్యాదిదారులను పిలిచి బహిరంగంగా సెల్‌ఫోన్‌ మేళా నిర్వహించడం ద్వారా వారికి తిరిగి అప్పగించడం జరి గింది. ఈ కొత్త ఎల్‌ఎంటిఎస్‌ యాప్‌ ద్వారానే పెండింగ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ కేసులు, అదేవిధంగా కొత్తగా నమోదవుతున్న కేసులను చేధించేస్తున్నారు. ఒకప్పుడు అసలు ఫిర్యాదు తీసుకోని పోలీసు యంత్రాంగం నేడు ఈ ఎల్‌ఎంటిఎస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాక చోరీకి గురైన సెల్‌ఫోన్‌ ఎక్కడున్నా క్షణాల్లో పట్టేస్తున్నారు. అయితే పనిగట్టుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయన వసరం లేదు.. అంతా ఆన్‌లైన్‌లోనే నమోదు చేసే వెసులుబాటు ఈ యాప్‌ ద్వారా కల్పించబడింది.

యాప్‌ ఎలా పని చేస్తుందంటే..

ముందుగా ఫిర్యాదు తన జిల్లా పేరుతో పోలీస్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌కి వెళ్లి మొబైల్‌ థెప్ట్‌n అనే లింకును ఓపెన్‌ చేయాలి. పోగొట్టు-కున్న ప్రదేశం, తేదీ, మొబైల్‌ నెంబరు, ఐఎంఈఐ వివరాలు, వ్యక్తిగత గుర్తింపు కార్డు, చిరునామా, సంప్రదించడానికి ప్రస్తుత మొబైల్‌ నెంబరు తదితర వివరాలు అందులో నమోదు చేయాలి. జిల్లా, పోలీస్‌స్టేషన్‌ పరిధి కూడా పొందుపర్చాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు నేరుగా జిల్లాల ఎస్పీల దృష్టికి వెళ్తుంది. దీనికోసం ప్రతి జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి రంగంలోకి దిగే దర్యాప్తు బృందాలు నెల రోజుల్లో ఫోన్‌ రికవరీ చేసి సమాచారం అందిస్తారు.

సచివాలయాల్లో పోస్టర్ల ద్వారా అవగాహన..

- Advertisement -

అయితే తమకు తాముగా యాప్‌లో ఫిర్యాదు చేయడం తెలియకపోతే మీసేవ, సచివాలయాలకు వెళ్లి సేవలు వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌ పట్ల అవగాహనకోసం ప్రతి జిల్లాలో ఆయా పోలీసు యంత్రాంగం ప్రచారం కల్పిస్తోంది. ఇక మీదట మీ సెల్‌ ఫోన్‌ బాధ్యత మాది అం టూ మొబైల్‌ ఫోన్‌ పోతే ఎలా అప్లయ్‌ చేయాలో అన్ని గ్రామ సచివాలయాల్లో గోడపత్రికలు ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి రుసుం చెల్లించాల్సినవసరం లేకుండా ఫోన్‌ రికవరీ చేస్తామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవలే కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం 500లకు పైగా మొబైల్‌ ఫోన్లు ఒకేసారి రికవరీ చేసి పెద్ద ఎత్తున మొబైల్‌ రికవరీ మేళా ఏర్పాటు- చేసి ఫిర్యాదిదారులకు అందచేశారు. ఇదే బాటలో ప్రకాశం, బాపట్ల జిల్లాలు కూడా.. ఇక క్రమంగా అన్ని జిల్లాల్లో ప్రతి నెలా మొబైల్‌ మేళా రికవరీలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement