- పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రభుత్వం ఒప్పందం.
- సంస్థ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ.
కర్నూల్ బ్యూరో, (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడకు మరో భారీ పరిశ్రమ రానుంది. ఈసారి ఇక్కడ పర్యావరణ కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఏర్పాటు కానుంది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో శుక్రవారం సాయంత్రం పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఓర్వకల్లు సమీపంలో 12 వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల పార్కు ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని పీపుల్ టెక్ గ్రూప్ సీఈవో టీజీ విశ్వప్రసాద్ తెలియజేశారు. వీటిలో వాహనాల తయారీ, R&D కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్‌లు, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈవీ పార్క్ కావడం విశేషం. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 25 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వాహనాల పార్కు ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ పరిణామమని పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇదో మైలురాయిగా కానుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రిని కలిసిన వారిలో భాస్కర రెడ్డి, రవికిరణ్ ఆకెళ్ల, బాబ్ డఫీ, స్టీవ్ గెర్బర్, హెరాల్డ్ రక్రిజెల్ తదితరులున్నారు.