ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు రానున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తిరుపతి నగరంలో జరగనుంది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశంకు అమిత్ షా రానున్న సందర్భంగా జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటప్ప నాయుడు మాట్లాడుతూ… సమావేశ ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు 24గంటలు నిఘా ఉంటుందన్నారు. సమావేశం నిర్వహణ ఏర్పాటుపై డీఎస్పీ స్థాయి అధికారులను సమన్వయ నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగిందని తెలిపారు. సదరం జోనల్ కౌన్సిల్ ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్. నికోబార్, లక్ష దీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హాజరు కానున్న నేపథ్యంలో భద్రత పరంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుండి తిరుమల వరకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అణువణువు తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు పేర్కొన్నారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ప్రముఖులందరూ తిరుమల శ్రీవారి దర్శనార్థం సూచనలున్న కారణంగా వారు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
వేదిక చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా సరిహద్దులు, ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో పాటు మెటల్ డిటెక్టర్ తో పరిసరాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. రాబోయే ఐదు రోజులు జిల్లా అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో కష్టపడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సుప్రజ, అదనపు ఎస్పీ లా అండ్ ఆర్డర్ హరి పుల్ల, తిరుమల అదనపు ఎస్పీ రామయ్య, ఎస్ బి ఐ డి. ఎస్. పి చంద్రశేఖర్. ఎస్. బి డి. ఎస్. పి టు .ఎం.రమణ, కమ్యూనికేషన్ డి.ఎస్.పి కొండయ్య, స్పెషల్ బ్రాంచ్ సిఐ సత్యనారాయణ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.