అమరావతి, ఆంధ్రప్రభ: పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడుదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలికారు. బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఏపీలో కార్యకలాపాలకు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్వాగతమంటూ ఆహ్వానించారు. సమర్థులైన యువత, స్నేహ పూర్వక ప్రభుత్వం, మౌళిక సదుపాయాలతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం అని తన ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుంది, మా రాష్ట్రం వృద్ధి చెందుతుంది అంటూ పోస్ట్‌లో స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు నేను పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో వ్యాపార అనుకూల ప్రభుత్వం, ప్రతిభావంతులైన యువత, ఉత్తమ మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలం అని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో చర్చించి కొత్త పాలసీలు తెచ్చిందని వివరించారు.
కొత్త పాలసీలు వేగవంతమైన వ్యాపార నిర్వహణకు దోహదం చేస్తాయన్న దృడ విశ్వాసాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. తాము దేశంలో అత్యుత్తమ వ్యాపార వాతారణ వ్యవస్థను నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో మీ వ్యాపారానికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని, తాను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నానని సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో భరోసా ఇచ్చారు.
భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ రాదని తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులతో మీ వ్యాపారం పెరుగుతుందని, రాష్ట్ర సామర్థం పెరుగుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మీ పెట్టుబడుల కోసం మేం ఎదురుచూస్తున్నామని సీఎం చంద్రబాబు తన ట్వీట్ ద్వారా పెట్టుబడుదారులను కోరారు.