Saturday, November 23, 2024

AP | పేదల ఇళ్లకు ఇం‘ధన’ సామర్ధ్యం.. త్వరలోనే అమలుకు ఈఈఎస్‌ఎల్‌ శ్రీకారం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని, అమలుచేస్తున్న నవర్నత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద వెనుకబడిన, బలహీన వర్గాలకు నిర్మిస్తున్న గృహ సముదాయాల్లో ఈ ఇంధన సామర్ధ్య చర్యలను దేశానికే రోల్‌ మోడల్‌గా అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్‌ఎల్‌, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్ధ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుంది.

పేదలందరికి ఇల్లు అనే కార్యక్రమం ద్వారా అర్హులైన కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించాలనే లక్ష్యంతో 30.65 లక్షల ఇళ్ల స్థలాలను ఇప్పటికే పంపిణీ చేసింది. ఇందుకోసం 71,811 ఎకరాలను సుమారు రూ. 56,102 కోట్లు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలుచేసి మహిళలకు అందజేసింది. మొత్తం లబ్ధిదారులలో 19.91 శాతం షెడ్యూల్డ్‌ కులాలకు చెందినవారు, 5.76 శాతం షెడ్యూల్డ్‌ తెగలకు, 54.35 శాతం వెనుకబడిన తరగతులకు, 19.98 శాతం ఇతర కులాలకు చెందినవారు ఉన్నారు.

30.65 లక్షల ఇళ్లను నిర్మించేందుకు ప్రాజెక్టు వ్యయం రూ. 83,460 కోట్లుగా నిర్ధారించారు. పీఎంఏవై-వైయస్సార్‌-అర్బన్‌ మరియు గ్రామీణ పథకాల కింద ఇప్పటికే గణనీయంగా 21.75 లక్షల గృహాలు మంజూరు చేయడం జరిగింది. దీని ప్రాజెక్ట్‌ వ్యయం రూ. 64,337 కోట్లుగా ఉంది.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీహెచ్‌సీఎల్‌) ద్వారా బలహీన వర్గాల కోసం గృహనిర్మాణ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీటిడ్‌కో పట్టణ పేదల కోసం 163 ప్రదేశాలలో 88 యూఎల్‌బీలలో 2.62 లక్షల ఇళ్లను నిర్మించడం జరుగుతోంది.

తొలిసారిగా ఇంధన సామర్ధ్య ఉపకరణాల పంపిణీ

తొలిసారిగా గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతి లబ్దిదారునికి 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్‌డీసీ ఫ్యాన్లతో సదుపాయాన్ని కల్పించనుంది. ఈ కార్యక్రమం లబ్దిదారులకు స్వచ్చందమేకానీ తప్పని సరి ఏమాత్రం కాదు. మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే లభించే ఈ పరికరాలకు సంబంధించిన ఈకార్యక్రమం లబ్దిదారులకు విద్యుత్‌ వినియోగంలో భారీగా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.

దీనికి ఈఈఎస్‌ఎల్‌ సహకారం అందిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సూచన మేరకు అత్యంత నాణ్యమైన స్టార్‌ రేటెడ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ పరికరాలను అందించడానికి గృహ నిర్మాణ శాఖకు ఈఈఎస్‌ఎల్‌ హామీ ఇచ్చినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు.

విద్యుత్‌ శాఖ సహకారంతో ఎనర్జీ ఎఫిషియెన్సీ పద్ధతులను అవలంబించడంతో పాటు గృహనిర్మాణ శాఖ ఉత్తమమైన విద్యుత్‌ మౌలిక సదుపాయాలను రూపొందించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో లబ్ధిదారులకు ఉత్తమ సేవలను అందించడంలో చురుకైన పాత్ర కోసం ఇంధన శాఖ మరియు డిస్కమ్‌లను ఆయన అభినందించారని అజయ్‌ జైన్‌ అన్నారు.

ఏడాదికి ఒక్కో ఇంటికి 734 యూనిట్ల ఆదా

ఈ చొరవ వల్ల ప్రతి ఇంటికి సంవత్సరానికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేయబడింది. ఫేజ్‌-1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధన ఆదా అవుతుందని గృహనిర్మాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ చెప్పారు. మెరుగైన జీవన నాణ్యత కోసం హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా సులభతరం చేయబడిన ఇంధన-సమర్థవంతమైన ఆఫర్‌లను స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలని హౌసింగ్‌ లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.

జీ ప్లస్‌ 3 నమూనాలో పరిమాణం, ఫైనాన్సింగ్‌ ఆధారంగా గృహాలను మూడు వర్గాలుగా విభజించబడ్డాయని తెలిపారు. లబ్ధిదారులకు 300 చ.అ. ఇళ్లు పూర్తిగా ఉచితమని చెప్పారు. మరికొన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు లబ్ధిదారుల రుణాల ద్వారా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. ఈ కాలనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.

నిర్మాణ వ్యయాలను తగ్గించడానికి, ప్రభుత్వం రాయితీతో కూడిన వస్తువులను అందిస్తుందన్న ఆయన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పారదర్శక చెల్లింపులను చేపడుతోందని వివరించారు. అంతేకాకుండా రవాణా ఖర్చులను మరింత ఖర్చు తగ్గించేలా జగనన్న లేఅవుట్లలోనే తాత్కాలిక ఇటుక, బ్లాక్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

అణగారిన వర్గాల అభ్యున్నతికోసం

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తున్నారని అజయ్‌జైన్‌ ప్రత్యేకించి చెప్పారు. నవరత్నాల కార్యక్రమంలో పెదలందరికి ఇల్లు అనే కార్యక్రమం హౌసింగ్‌ ఇనిషియేటివ్‌గా మారిందని కితాబిచ్చారు. ఇది నిరుపేదల జీవితాలను మారుస్తుందన్నారు. వారిని సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు దోహదపడుతుందని తెలిపారు.

సీఎం జగన్‌ నేతృత్వంలో, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మార్గదర్శకత్వంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేస్తోందన్నారు. పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19.13 లక్షల ఇళ్లు గ్రౌండింగ్‌లో ఉండగా మరో 10.43 లక్షలు బేస్‌మెంట్‌ మరియు అంతకంటే ఎక్కువ దశల్లో ఉన్నాయని తెలిపారు.

అలాగే 5.08 లక్షల ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 15,584 కోట్లు పంపిణీ చేసిందన్నారు. ఇందులో రూ. 12,543 కోట్లు లబ్ధిదారులకు, మెటీరియల్‌ సరఫరాదారులకు 3,041 కోట్లు వంతున చెల్లించడం జరిగిందని వివరించారు. ఇవే కాకుండా ఏపీటిడ్‌కో కింద 1.57 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. వీటిలో 0.95 లక్షల మేర ఇళ్లు పూర్తవుతున్నాయన్నారు.

వీటి విలువ రూ.14,090 కోట్లుగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో 19.13 లక్షల ఇళ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు మరియు ఇతర సామాజిక సౌకర్యాలతో సహా ఇవి ఏర్పాటవుతున్నాయని వివరించారు. సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు 2777 కోట్లు ఇప్పటికే కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఐఐటీ సిబ్బందితో నాణ్యతపై శిక్షణ

తిరుపతి ఐఐటీలో సిబ్బంది శిక్షణ, థర్డ్‌-పార్టీ తనిఖీల ద్వారా నాణ్యతను పరిశీలించడం జరుగుతోందన్నారు. నాణ్యమైన హౌసింగ్‌ మరియు ఇంధన సామర్థ్యానికి ప్రభుత్వం యొక్క నిబద్ధత మరింత సమానమైన, స్థిరమైన భవిష్యత్తు కోసం ఒక లక్ష్యంతో పురోగతిని సూచిస్తుందన్నారు.

వచ్చే ఏడాది అర్హులైన అన్ని కుటుంబాలకు శాశ్వత గృహాలు అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వం దృఢంగా ఉందని తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఈవో విశాల్‌ కపూర్‌ తరపున సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్‌ మిశ్రా, నితిన్‌ భట్‌, సావిత్రి సింగ్‌, పవన్‌లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ను కలిశారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఎండీ లక్ష్మీ షా, జేడీ శివ ప్రసాద్‌ మరియు హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్‌ ప్రభావం గురించి వివరించారు. దీనిపై నివేదికను సమర్పించేటప్పుడు ఇంధన సామర్థం యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పారు. ఇంధన-సమర్థవంతమైన ఉపకరణాలు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని, ఇంధన సంరక్షణకు గణనీయంగా దోహదం చేస్తాయని, ఆర్థిక పొదుపు పట్ల ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement