Friday, November 22, 2024

End Card – 1632 రోజులు అమరావతి ఉద్యమానికి తెర …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వంలో నిద్రలేని రాత్రులు గడిపిన అమరావతి అన్నదాతలు రాష్ట్రంలో కూటమి ఘనవిజయంతో ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యమబాటలో ఉన్న రైతులు, మహిళలకు మంచి రోజులొచ్చాయని సంబ‌రాలు చేసుకుంటున్నారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కానుండడంతో ఉద్యమాన్ని విరమించనున్నారు. ఈ మేర‌కు గురువారం ఉద్య‌మ నేత‌లు త‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు.

రాజ‌ధాని కోసం రైతుల త్యాగం

రాజధాని లేని రాష్ట్రం కోసం 28,587 మంది రైతులు 34,385 ఎకరాల భూమిని సమీకరణలో ఇచ్చారు. నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్న దశలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. వచ్చీరాగానే ప్రజావేదికను పడగొట్టి విధ్వంసానికి నాంది పల‌క‌డంతో పాటు. అనంతరం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి కకావికలమైంది.

- Advertisement -

2019 డిసెంబ‌ర్‌లో ఉద్య‌మానికి శ్రీకారం

అమ‌రావ‌తి రైతులు రాజధాని పరిరక్షణ కోసం 2019 డిసెంబరు 17న ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. అమరావతి ఉద్యమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్విరామంగా 1,632 రోజులుగా సాగుతూనే ఉంది. తమ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసేందుకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు మరో పాదయాత్ర నిర్వహించారు.

ఉద్య‌మంలో 270 మంది రైతులు మృతి

అమరావతిని రక్షించుకునే క్రమంలో 270 మందికి పైగా రైతులు, రైతుకూలీలు మరణించారు. ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రైతులకు అనుకూల పరిస్థితి వచ్చింది. ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చిన టిడిపి,జ‌న‌సేన‌,బిజెపి కూటమి విజయం సాధించింది. ఇక అమరావతికి మంచిరోజులు వచ్చాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సారథ్యంలో రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగి అమరావతి విశ్వనగరంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.

చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఉద్య‌మానికి తెర

ఈ నేపథ్యంలో తమ ఉద్యమానికి ముగింపు పలకనున్నారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి నేతలు చంద్రబాబును నేడు, రేపో క‌లువ‌నున్నారు. అలాగే . రాజధాని గ్రామాల్లో ఏర్పాటైన శిబిరాలను తొలగించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగా నేటి నుంచి దీక్షా శిబిరాలు తొల‌గింపు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది.. ఇక చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణస్వీకారం వేదికపైనే అమరావతి రైతులకు హామీ ఇచ్చి వారితో చంద్ర‌బాబే ఉద్యమం విరమింపజేస్తారని అమ‌రావ‌తి రైతులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement