కర్నూలు బ్యూరో : జిల్లాలో చెరువులు, వాగులు, అలుగులను కబ్జా చేసిన బిల్డర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి స్వాధీనం చేసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఏ వెంకటేశ్వర్లు, న్యాయవాది ఆర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక జలమండలి కార్యాలయం ఎదుట పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు కాలనీల ప్రజలు, ప్రతినిధులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు ఎం.నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బ్రిటిష్ కాలం నాటి చెరువులు, వాగులు, అలుగులను కబ్జాల నుండి కాపాడాలని ఆందోళన చేసి అర్జీలు ఇచ్చి చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారుల్లో స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బి.తాండ్రపాడు, గార్గేయపురం చెరువు, వాగుల కబ్జాల ఫోటోలను ఫ్లెక్సీలపై ముద్రించి నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ద్వారక నాధరెడ్డికి చూపెట్టారు. చెరువులు, వాగులు, అలుగు కబ్జా చేసిన వారినీ.. వారికి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాలపై చర్యలతో పాటు సదరు భూములను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ఆందోళనకారులు పట్టుబట్టారు.
రెవెన్యూ, నగరపాలక సంస్థ, భూముల రికార్డులు, సర్వే శాఖలతో చర్చించి ఆక్రమణకు గురైన నీటిపారుదల శాఖకు సంబంధించిన భూములన్నీ స్వాధీనం చేసుకుంటామని ఇరిగేషన్ ఏఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రతినిధులు మహమ్మద్ యునూస్, ప్రభాకర్ రెడ్డి, సివి వర్మ, ఎస్ ఆర్ గౌడు, అన్వర్ భాష, శ్రీనివాసులు, పురుషోత్తం రెడ్డి, శశి కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.