Friday, November 8, 2024

AP | వికసిత్ భారత్ ద్వారా స్టార్టప్ లకు ప్రోత్సాహం.. కేంద్ర మంత్రి పెమ్మసాని

నూతన ఆవిష్కరణలతో ముందుకు రండి
మోదీ, చంద్రబాబు విజనరీతో దేశంలో సుస్థిర అభివృద్ధి
వికాస్ – 2024 స‌మావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: సమాజానికి దోహదపడే నూతన ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి లీడర్ల విజనరీతో భారత దేశంలో స్టార్టప్ లకు గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ దాగి ఉన్న ప్రతిభావంతులను వెలికితీసి, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు వీవీఐటీ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన వికాస్ – 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొని మాట్లాడారు.

2024 ముందు భారతదేశంలో కేవలం అతి తక్కువ సంఖ్యలో స్టార్టప్ లు ఉండేవని, ప్రస్తుతం 1.12 లక్షల స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని అన్నారు. యూనికాన్స్ నాలుగు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 1100 ఉన్నాయని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. భారతదేశం జనాభా, పేదరికం, స్థానిక పరిస్థితుల ఆధారంగానే జీడీపీ ఆధారపడి ఉంటుందని, ప్రజల జీవనోపాధులు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇండియాలో సుస్థిరమైన ప్రగతి కోసం వికసిత్ భారత్, వికాస్ వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.

తాను నిర్వహిస్తున్న కమ్యూనికేషన్స్, రూరల్ డెవలప్ మెంట్ శాఖల్లో స్టార్టప్ లను ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీగా ఆశయాలతోనే భారతదేశం పదేళ్ల కాలంలో ఆదర్శవంతమైన అభివృద్ధి సాధించిందని అన్నారు . మోదీ దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళితే తనకులాగా విజయాలు సాధించవచ్చని పెమ్మసాని తెలిపారు.

- Advertisement -

ఎంసెట్ లో తాను 27 ర్యాంక్ సాధించానని, తనకంటే 26 మంది ముందున్నా కానీ, తన ఆలోచనలు విస్త్రృతం చేయడం ద్వారా సక్సెస్ సాధించానని పేర్కొన్నారు. ఇది యువతకు ఆదర్శం కావాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చించిన పెమ్మ‌సాని అనంతరం యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు స్టార్ట్ అప్స్ పై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఆయన నివృత్తి చేశారు.

కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఛాన్స్ లర్ జి విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, వైస్ ఛాన్స్లర్ ఎస్ వి. కోటా రెడ్డి, రిజిస్టర్ జగదీష్ సి. ముదిగంటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement