Sunday, November 24, 2024

AP | ఉపాధి వేతనాలకు రూ. 639 కోట్లు మంజూరు.. వెల్ల‌డించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మదర్‌ శాంక్షన్‌ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం రూ. 639.41 కోట్లు మంజూరు చేసిందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ ఇందులో ఎనిమిదో విడతగా రూ. 233.88 కోట్లు, తొమ్మిదో విడతగా రూ.405.53 కోట్లు వంతున ఉన్నాయని చెప్పారు.

ఇప్పటికే మొదటి విడతగా రూ. 929.20 కోట్లు, రెండో విడతగా రూ.228.91కోట్లు, మూడో విడతగా రూ.670.58 కోట్లు, నాల్గో విడతగా 1769.29 కోట్లు, ఐదో విడతగా 77.11 కోట్లు, ఆరో విడతగా రూ. 386.81 కోట్లు, ఏడో విడతగా రూ. 297.41 కోట్లను మదర్‌ శాంక్షన్‌గా మంజూరు చేసిందని గుర్తుచేశారు. అంటే ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ. 4,998.73 కోట్లకు మదర్‌ శాంక్షన్‌ ఇచ్చినట్లవుతుందని ఆయన వివరించారు.

కాగా ఇప్పటివరకు రూ. 4,627.32 కోట్లు- రోజువారీ వేతన ఎఫ్‌.టిఓల అప్‌ లోడ్‌ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement