Sunday, December 22, 2024

AP | అవినీతి, అక్రమాలకు అడ్డగా ఉపాధి హామీ పధకం

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర రేఖకు దిగువన ఉన్న నైపుణ్యం లేని వయోజనులకు ఉపాధి కల్పించడానికి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చిత్తూరు జిల్లాలో అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో వంద రోజుల పని దినాలను కల్పించి, వారికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అవినీతిపరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.

ఈ పథకం ప్రాథమిక ఉద్దేశాలను దెబ్బతీస్తూ పేదలకు వేతనం కింద నిరుపేదలకు చెల్లించాల్చిన నిధులను స్వాహా చేస్తున్నారు. కూలీలతో పని చేయించినట్లు నమోదు చేస్తూ యంత్రాలతో పనులను చేస్తూ పేద కూలీల సొమ్ములతో కొందరు బడా నాయకులు జేబులు నింపుకుంటున్నారు.

సామాజిక తనిఖీల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేస్తున్నా, తిరిగి అదే తప్పులు పునరావృతం అవుతున్నాయి. అవినీతికి పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ పథకంలో అవినీతి, అక్రమాలకు అంతం ఉండడం లేదు.

- Advertisement -

గత ఐదేళ్ల‌లో రూ.3.86 కోట్ల స్వాహా…

జిల్లా నీటి నిర్వహణ సంస్థ జిల్లాలో ఉపాధి హామీ పనులను అమలుచేస్తుంది. ఇందుకోసం చిత్తూరు జిల్లాను ఐదు క్లస్టర్లుగా విభజించారు. ఈ ఐదు క్లస్టర్లలో గత వైసిపి పాలనలో రూ.3.86 కోట్ల అవినీతి జరిగింది. ఇందులో రూ.2.54 కోట్ల రికవరీ చేశారు. ఇంకా రూ.1.32 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పనులలో జరిగిన అవకతవకల నేపథ్యంలో 62 మంది సిబ్బందిని జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు.

  • చిత్తూరు క్లస్టర్ కింద చిత్తూరు, గంగాధర నెల్లూరు, గుడిపాల, పాలసముద్రం, పెనుమూరు, తవణంపల్లి, యాదగిరి మండలాలు వస్తాయి. ఈ క్లస్టర్ లో గత ఐదు సంవత్సరాలు రూ.44.55 లక్షల అవినీతి జరిగింది. ఇందులో 30.14 లక్షలను రికవరీ చేశారు. ఇంకా రూ.14.41 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది.
  • కుప్పం క్లస్టర్ పరిధిలో బైరెడ్డిపల్లి, గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం. వీ.కోట మండలాలు వస్తాయి. ఈ క్లస్టర్ పరిధిలో గరిష్టంగా రూ.129.51లక్షల అవినీతి జరిగింది. ఇందులో రూ.73.29 లక్షలు రికవరీ చేశారు. ఇంకా 56.22 లక్షలను రికవరీ చేయాల్సి ఉంది.
  • నగరి క్లస్టర్ పరిధిలో కార్వేటి నగర్, నగిరి, నిండ్ర, ఎస్ఆర్ పురం, వెదురుకుప్పం, విజయపురం మండలాలు వస్తాయి. ఈ క్లస్టర్ పరిధిలో రూ.73.07 లక్షల అవినీతి జరిగింది. ఇందులో రూ.53.80 లక్షలు రికవరీ చేశారు. ఇంకా రూ.19.27 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది.
  • పుంగనూరు క్లస్టర్ పరిధిలో బంగారు పాల్యం. చౌడేపల్లి, గంగవరం, పలమనేరు, పెద్దపంజాని, పుంగనూరు మండలాలు వస్తాయి. ఈ మండలాల్లో రూ.58.20 లక్షల అవినీతి జరిగింది. ఇందులో రూ.46.36 లక్షలు తిరిగి వసూలు చేయగా, రూ.11.83 లక్షలు ఇంకా వసూలు చేయాల్సి ఉంది.
  • సదం క్లస్టర్ పరిధిలో ఐరాల, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచర్ల, సదం, సోమల మండలాలు వస్తాయి. ఈ మండలాల్లో రూ.80.61 లక్షల అవినీతి జరిగింది. ఇందులో రూ50.07 లక్షలు రికవరీ చేశారు. ఇంకా రూ.30.54 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది.

62 మంది సిబ్బంది, అధికారుల సస్పెన్షన్..

అయితే, అవినీతి, అవకతవకల కారణంగా 62 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో తిరిగి 39 మందిని విధుల్లోకి తీసుకున్నారు. 23 మందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు. గత ప్రభుత్వంలో శాంతిపురం, రామకుప్పం మండలం మండలాల్లో భారీ ఎత్తున అవినీతి, అవకతవకలు జరిగాయి. పేదల ఉపాధికి ఉద్దేశించిన ఈ నిధులను పెద్దలు తమ జేబుల్లో వేసుకున్నారు.

గంగాధర నెల్లూరు, ఐరాల, పెద్దపంజాణి, పూతలపట్టు, వీ.కోట వెదురుకుప్పం మండలాల్లో ఒక్కొక్కరు వంతున ఉద్వాసనలకు గురయ్యారు. గుడిపాల మండలంలో ఇద్దరు, కుప్పం, నగిరి, పలమనేరు, రొంపిచర్ల మండలంలో ముగ్గురు వంతున తొలగించారు. నిండ్ర, గంగవరం మండలల్లో ఐదు మంది వంతున విధుల నుంచి తొలగించగా, రామకుప్పం మండలంలో 13 మందిని, శాంతిపురం మండలంలో 18 మందిని తొలగించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నామమాత్రపు చర్యలు కారణంగా తిరిగి అవకతవకలు, అవినీతి పునరావృతమవుతుంది.

అవినీతిని పాల్పడిన సిబ్బంది ఆ మొత్తాలను తిరిగి చెల్లిస్తే వారిని విధుల్లోకి తీసుకుంటున్నారు. వారు ఎదో రకంగా మళ్ళి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, ఈ పధకం ఉద్దేశాలకు గండి కొడుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చట్టంలో ఉన్నా, జిల్లా అధికారులు ఇందుకు సాహసం చేయడం లేదు. ఫలితంగా జిల్లాలో ఉపాధి హామీ పనులలో అవినీతి, అక్రమాలు నానాటికి పెరిగిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement