Tuesday, November 26, 2024

లక్ష మందికి ఉపాధి, త్వరలో మరో నాలుగు ఓడ రేవులు.. రామాయపట్నంలో సీఎం జగన్‌

నెల్లూరు, ప్రభ న్యూస్‌ బ్యూరో : రాష్ట్రంలో కోస్తా తీరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు శరవేగంగా తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా మరిన్ని ఓడరేవులను ఏర్పాటు చేయాలని సంకల్పించాం. తద్వారా జల రవాణా సామర్ధ్యం పెరగడంతోపాటు సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగ పుత్రులకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అందులో భాగంగానే లక్ష మంది గంగ పుత్రులకు ఉపాధి అవకాశాలు కల్పించేదిశగా పోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రామాయపట్టణం పోర్టుకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రామాయపట్టణం తీరంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మత్స్యకారులను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. వారికోసం రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే కోస్తా తీరం అభివృద్ధికోసం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఓడరేవులు తదితర అంశాలను సభలో వివరించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఓడరేవుల నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. అందులో భాగంగానే రూ. 3,700 కోట్ల భారీ వ్యయంతో రామాయపట్టణం వద్ద ఓడ రేవును ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దశలవారీగా బెర్తులను అభివృద్ధిచేసి గంగపుత్రులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పుతున్న పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చట్టం కూడా చేశామన్నారు.

ఏప్రాంతంలో పరిశ్రమ ఏర్పడ్డా ఆప్రాంతంలోని నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉపాధి అవకాశాల్లో మొదటి ప్రాథాన్యత కల్పిస్తున్నామన్నారు. ఈప్రక్రియలో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఓడరేవుల్లో మత్స్యకార కుటుంబాలకు చెందిన లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆదిశగా సంబంధిత అధికారులకు స్పస్టమైన ఆదేశాలు కూడా ఇచ్చామన్నారు.

గతంలో పోర్టుల పరిస్థితి….
రాష్ట్రంలో కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం, తదితర ప్రాంతాల్లో పోర్టులున్నాయన్నారు. వీటిలో విశాఖపట్నం కాకుండా మిగిలిన పోర్టులు కెపాసిటి 158 మిలియన్‌ టన్నులు ఉంటే.. విశాఖపట్నం పోర్టు మరో 70 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం కలిగి ఉందన్నారు. తమ హయాంలో కొత్తగా 4 పోర్టులు- 9 ఫిషింగ్‌ హార్భర్లు తీసుకొస్తున్నామన్నారు.. స్వాతంత్యం వచ్చినప్పుటి నుంచి ఇప్పటివరకు మనకు కేవలం 6 పోర్టులుంటే మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నామని తెలిపారు. ఈ 5 సంవత్సరాలలో మరో 4 పోర్టులు.. భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నంలు రానున్నాయని, వీటి ద్వారా మరో 100 మిలియన్న టన్నుల కెపాసిటీకి కూడా వస్తోందని సీఎం జగన్‌ తెలిపారు. ఈ నాలుగు పోర్టులతో పాటు- రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్‌లు కూడా వేగవంతంగా నిర్మాణం జరుపుకుంటు-న్నట్లు వెల్లడించారు. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్పలతో పాటు మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నంతో పాటు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్భర్‌లు నిర్మాణం జరుపుకుంటు-న్నాయని వివరించారు.

60 రోజుల్లో 2 పోర్టులు :
పోర్టులకు సంబధించిన నిర్మాణపనులు నేటి నుంచి వేగవంతం అవుతున్నాయని చెప్పారు. మరో రెండు నెలల తిరక్క మునుపే మిగిలిన పోర్టులకు కూడా భూమిపూజ చేసుకునే దిశగా పనులు వేగవంతం చేస్తున్నామని, ఇలా 4 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్భర్లు త్వరలోనే వినియోగంలోకి వచ్చేలా ముందుకు సాగుతున్నామన్నారు. మన దగ్గర ఉన్న 6 పోర్టులను గమనిస్తే.. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక షిషింగ్‌ హార్భర్‌ కానీ, పోర్టు కానీ ఉండేలా వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. 9 ఫిషింగ్‌ హార్భర్లు పూర్తి అయితే.. వీటి ద్వారా 1లక్ష మంది మత్స్యకార కుటు-ంబాలు ఉద్యోగ, ఉఫాధి అవకాశాలకు గుజరాత్‌ వంటి ప్రాంతాలకో, వేరెక్కడికో పోవాల్సిన అవసరం ఉండదన్నారు. నాలుగు పోర్టులు కాకినాడ ,మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం ద్వారా కూడా ఒక్కోక్క పోర్టులో నేరుగా కనీసం 3-4 వేలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. పరోక్షంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రావడంతో పాటు- పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుందని, మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలకు నాంది పలుకుతున్నామని తెలిపారు.

- Advertisement -

డీపీఆర్‌ లేకుండానే శంకుస్థాపన చేశారు :
2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగితే… అప్పటి పాలకులు చంద్రబాబునాయుడు 2019 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చి శంకుస్ధాపన చేసారని విమర్శించారు. అప్పుడు డీపీఆర్‌, భూసేకరణ లేకుండా ప్రజలను మోసం చేయాడానికి ఆ రోజు ఇక్కడకి వచ్చి శంకుస్ధాపప కోసం -టెంకాయ కొట్టిపోయారంటూ ఎద్దేవ చేశారు. ఐదు సంవత్సరాలు ఏం చేయకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్ధాపన అంటే ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమే తప్ప ఇంకేముంటుందని ప్రశ్నించారు. గతపాలనలో రుణమాఫీ అంటూ రైతులను, అక్కచెల్లెమ్మలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఉద్యోగాలు అంటూ చదువుకుంటు-న్న పిల్లలనూ మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

రూ.3700 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులు..
రామాయపట్టణం పోర్టు కోసం 850ఎకరాల భూమి కూడా పూర్తిగా సేకరించి రూ.3700 కోట్లతో పనులు కూడా మొదలయ్యే పరిస్థితిని తీసుకొచ్చామన్నారు. పోర్టు ద్వారా 4 బెర్తులు పూర్తిగా అందుబాటు-లోకి వస్తాయని తెలిపారు. మరో 6 బెర్తులు కూడా ఇదే ఇన్‌ఫ్రాస్చ్రక్టర్‌లోనే వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. ఒక్కోదానికి రూ.200 కోట్లు- పెట్టు-బడి పెట్టు-కుంటూ పోతే మిగిలిన ఆరు బెర్తులు కూడా అందుబాటు-లోకి వస్తాయని వివరించారు. ఈ 4 బెర్తుల ద్వారా 25 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేసే సామర్ధ్యం లభిస్తే… మరో రూ.1200 కోట్లు- మనం ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు పెట్టు-బడి పెడితే… ఏకంగా 50 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేయవచ్చన్నారు. అంతకు ముందు పోర్టు శంకుస్థాపనకు రామాయపట్టణంకు వచ్చిన సీఎం జగన్‌కు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ కేవీ చక్రధర బాబు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంబటి రాంబాబు, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి స్వాగతం పలికారు. స్థానిక జిల్లా నేతలను పేరుపేరునా పలకరించిన సీఎం జగన్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆదాల ప్రభాకర రెడ్డి, బీదా మస్తాన్‌ రావు, ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ఒ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, పోలుబోయిన అనీల్‌ కుమార్‌ఒ యాదవ్‌, మేకపాటి విక్రమ్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణ రెడ్డి, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, వైసీపీ నేతలు కోటమరెడ్డి గిరిధర్‌ రెడ్డి, సెంట్రల్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారాకానాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement