విశాఖ: ఇనార్బిట్ మాల్ తో 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం కైలాసపురంలో అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్ మాల్ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు.
ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… 2026 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుందన్నారు. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. మాల్ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారన్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారన్నారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారన్నారు. మూడో దశలో ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌ను 200 గదులు, బాంకెట్ హాళ్లతో నిర్మిస్తారన్నారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిర్మించనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించిందన్నారు. ముందుగా విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్ బాబు, గుడివాడ అమర్ నాథ్, టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ అధ్యక్షులు జె. సుభద్ర, ఎంపి ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున, శాసన మండలి సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరదు కళ్యాణి, శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గణేష్ బాబు, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, ఉమా శంకర్ గణేష్, భాగ్యలక్ష్మి, నెడ్ క్యాప్ ఛైర్మన్ కెకె రాజు, డిసిసిబి చైర్మన్ కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు.