అమరావతి,ఆంధ్రప్రభ: ఆర్ధికాభివృద్దితోపాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున లఘు, చిన్న, మద్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్క్‌లను ఏర్పాటు చేయబోతోంది. ఒక్కొ అసెంబ్లి నియోజకవర్గంలో ఒక్కొ పార్క్ చొప్పున 175 పార్క్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోంది. మొదటి దశలో భాగంగా 75 పార్క్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. అభివృద్ది చెందిన దేశాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లను అధ్యయనం చేసేందుకు త్వరలోనే పరిశ్రమల శాఖకు చెందిన నిపుణుల బృందం విదేశీ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఎలాంటి విధానాలు అమలుపరుస్తున్నారో పరిశీలించి, వాటిని మన రాష్ట్రంలో అమలుపరచనున్నారు. ఈ పార్క్‌ల ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధుల రాబట్టేందుకు క్లస్టర్ ఆధారిత పరిశ్రమల పార్క్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.
ఉపాధి కల్పనే లక్ష్యం..
పెద్ద పెద్ద కంపెనీలకన్నా చిన్న తరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన ఎక్కువగా ఉంటుంది. ఎనిమిదివేల కోట్లతో ఒక ఆటోమొబైల్ పరిశ్రమ పెడితే, పది వేల మందికి ఉపాధి లభిస్తుంది. అదే ఇంతే మొత్తం పెట్టుబడి చిన్న తరహా పరిశ్రమల్లో పెడితే లక్ష మందికి ఉపాధి కల్పిస్తారని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పార్క్‌ల ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించనుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తయిందని, వీటిల్లోకి దాదాపు 25 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపింది. మార్చి నాటికి మరో 50 పార్క్‌లు పూర్తవుతాయని, వీటన్నింటి ద్వారా 15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పెద్ద పెద్ద పరిశ్రమలు అధికంగా మూతపడుతుండడం, లేదా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది, కోవిడ్ తర్వాత అభివృద్ది చెందిన దేశాలన్ని చిన్న తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాయి, ఈ నేపథ్యంలోనే సిఎం జగన్మోహన్‌రెడ్డి కూడా ఎంఎస్‌ఎంఈ పార్క్‌లపై దృష్టి పెట్టారు.
నియోజకవర్గానికో పార్క్..
చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ ప్రతి అసెంబ్లి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 పార్క్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కొ పార్క్‌కు వంద నుండి రెండు వందల ఎకరాల స్థలాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించి స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే 25 పార్క్‌ల ఏర్పాటు పూర్తయ్యింది. మార్చి నాటికి మరో 50 కూడా సిద్దమౌతున్నాయి. మిగిలిన 100 పార్క్‌లకు సంబంధించి మార్చిలోగా భూమిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఆ పార్క్‌ల్లో పరిశ్రమలు పెట్టే వారికి భూమి రేటు, విద్యుత్‌తోపాటు అనేక రకాల సబ్సిడీలు ఇస్తారు. అదే విధంగా ఒక్కొ పార్క్ ఒక్కొ రకమైన ఉత్పత్తులను మాత్రమే ఉత్పత్తి చేసేలా డిజైన్ చేయనున్నారు. దీని వల్ల క్టస్టర్ బేస్డ్ పార్క్‌లు ఏర్పడతాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను కూడా సులభంగా తీసుకురావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు 175 పార్క్‌లు సాకారమైతే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది.