పీఆర్సీల అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. ”ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే” అని అన్నారు.
చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, చర్చలు, కమిటీపై అపోహలు వీడాలని సజ్జల పిలుపునిచ్చారు. ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమేరకు మంచి చేశామో తాము చెబుతున్నామని సజ్జల పేర్కొన్నారు. అలా కాకుండా ప్రభుత్వ కమిటీని గుర్తించబోమని ఉద్యోగులు పేర్కొనడం ప్రతిష్టంభనను మరింత పెంచడమేనని సజ్జల తెలిపారు.