ఏలూరు ప్రభ న్యూస్ క్రైమ్ – ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఓ మహిళకు కాన్పు కోసం సిజేరియన్ చేసిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కత్తెరను కడుపులోనే వదిలేసి కుట్లు వేసేశారు. ఆ రోజు నుంచి బాధితురాలు కడుపు నొప్పితో బాధపడుతుంది. ఎక్స్ రే తీయడంతో విషయం వెలుగు చూసింది. తమ తప్పు గ్రహించిన వైద్యులు వెంటనే ఆసుపత్రి రికార్డునుండి బాధితురాలు వివరాలను మాయం చేసినట్లు సమాచారం. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ మహిళ చేరింది. వైద్యుల పరీక్షలు నిర్వహించి ఆమెకు సిజేరియన్ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు. అంత వరకు బాగానే ఉన్నా ఆపరేషన్ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు.
అయితే, అప్పటి నుంచి బాధితురాలు కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనను బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుండగా. ఆ ఎక్స్‌రే ఫొటోను ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. దీంతో, షాక్ తిన్న ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను తొలగించారు. మరోవైపు ఆస్పత్రి రికార్డుల్లో బాధితురాలి వివరాలు కూడా మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. దీనిపై వైద్యులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, మరోవైపు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.