Friday, November 22, 2024

అమ్మఒడికి అర్హులెందరు, లిస్ట్​ రెడీ చేస్తున్న ప్రభుత్వం.. గ్రామ సచివాలయ శాఖతో యాప్‌లో నమోదు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రారంభించిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు జూన్‌లో నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏటా జనవరిలో అమ్మఒడి నిధులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, కరోనా, ఆర్థిక లోటు తదితర కారణాల వల్ల గత విద్యా సంవత్సరం పథకాన్ని వాయిదా వేసింది. జనవరిలో విడుదల చేయాల్సిన అమ్మఒడి పథకం నిధులను జూన్‌లో అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విద్యార్థుల హాజరు కచ్చితంగా 75 శాతంపైగా ఉండటంతోపాటు పలు నిబంధనలను పక్కాగా అమలు చేయనుంది. గత రెండేళ్లు కరోనా కారణంగా విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో నడవకపోవడంతో హాజరు నిబంధనకు సడలింపునిచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో తరగతులు జరుగుతుండటంతో హాజరును తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమ్మఒడికి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని, అనర్హులను తొలగించాలనే ఆలోచనతో ప్రత్యేక పరిశీలన చేపడుతోంది.

ప్రత్యేక యాప్‌లో జాబితాలు..

అమ్మ ఒడి పథకం ఈ సంవత్సరానికి సంబంధించి అర్హులను, అనర్హులను గుర్తించే ప్రాసెస్‌లో మొదటగా లబ్ధిదారుల అవుట్‌రీచ్‌ సర్వే జరపాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా బెనిఫిషియరీ ఔట్‌ రీచ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ 4.7 విడుదల చేస్తూ అర్హుల, అనర్హుల జాబితాలను విడుదల చేయనుంది. నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్‌ సిస్టమ్ గ్రీవెన్స్‌లో లబ్ధిదారులకు సంబంధించి ఆరంచెల ధ్రువీకరణ నిర్వహించే పనిని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నిర్వహిస్తోంది. ఈ యాప్‌లో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించి లబ్ధిదారుల ఈకేవైసీ నమోదు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల 19 వేల 675 మంది వివరాలు సేకరించగా.. వారందరి ఈ కేవైసీ నమోదుతోపాటు ఆరంచెల ధ్రువీకరణలో అనర్హులను తొలగించనున్నారు. ఇప్పటికే(ఆదివారం రాత్రికి) 5 లక్షల 1095 మంది(11.88 శాతం) ఈ కేవైసీ పూర్తి చేయగా.. సోమవారం నుంచి వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సోమవారం నుంచి యాప్‌లో అర్హుల, అనర్హుల జాబితాలను జిల్లా, మండలాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల సహకారంతో ప్రధానోపాధ్యాయులు రూపొందించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement