అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,230 ఆక్వా సాగు విద్యుత్ కనెక్షన్లను సబ్సిడీ అందించనున్నట్టు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఆక్వా సాధికారత కమిటీ సమావేశంలో వారు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆక్వా సాగుకు సంబంధించి కొన్ని కీలక విషయాలపై తీర్మానాలు ఆమోదించారు.
ఇప్పటికే రాష్ట్రంలో 46,433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు సబ్సిడీకి అర్హత ఉన్నట్టు గుర్తించగా కొత్తగా మరో 4230 కనెక్షన్లను కూడా ఆ జాబితాలో చేర్చినట్టు తెలిపారు. నవంబర్ 1 నుంచి కొత్త కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపచేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4.65 లక్షల ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో ఉండగా 10 ఎకరాల లోపు 3.26 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్న రైతులకు విద్యుత్ సబ్సిడీ రూపంలో లబ్ది చేకూరుతుందని తెలిపారు.
ఆక్వా సాధికారత కమిటీ ఇప్పటికి ఆరు సార్లు సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించి పరిష్కరించినట్టు తెలిపారు. ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లోని ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే రైతులకు అన్ని విధాలా కమిటీ సహకారం అందించిందని వెల్లడించారు. కేజీకి 100 రొయ్యల కౌంట్ కు రూ 240 ధరను నిర్ణయిస్తూ కమిటీ తీర్మానం ఆమోదించినట్టు తెలిపారు.
100 కౌంట్‌కు వ్యాపారులు ఖచ్చితంగా రూ.240 చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్థానిక మార్కెట్‌ల ద్వారా ప్రతినెలా 1000 మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను విక్రయియిస్తుండగా దానిని మరింత పెంపుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. దీని కోసం ఆక్వా హబ్‌లను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యసాయ, పశు సంవర్ధక, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.