Thursday, November 21, 2024

AP | తీరనున్న టిడ్కో ప్రాంత ప్రజల కరెంటు కష్టాలు.. రూ.8 కోట్లతో సబ్‌ స్టేషన్‌ నిర్మాణం

అమరావతి, ఆంధ్రప్రభ మంగళగిరి జగనన్న కాలనీ (టిడ్కో గృహ సముదాయం)లో నూతనంగా రూ.8 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టినన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవానికి సిద్దమైంది. దీంతో టిడ్కోవాసులతోపాటు పరిసర ప్రాంతాలలోని ప్రజల కరెంటు కష్టాలు తీరనున్నాయి. జగనన్న కాలనీలో సుమారు 1728 కుటుంబాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు.

కాలనీకి ఆ ప్రాంతంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌ నుండి విద్యుత్‌ సరఫరా చేయడానికి కెపాసిటీ చాలక పోవడంతో అధికారులు సమీపంలోని ఏపీఐఐసీ నుండి కరెంటు తీసుకొని విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు జగనన్న కాలనీ సమీప ప్రాంతాలలో ప్రజలు లోవోల్టేజి వంటి విద్యుత్తు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

- Advertisement -

దీంతో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రజల ఇబ్బందులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ట్రాన్స్‌కో ద్వారా సుమారు రూ.8 కోట్ల రూపాయలు మంజూరు చేయించి, నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం చేయించారు. జగనన్న కాలనీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ అందంగా రూపుదిద్దుకొంది.

ఈ సబ్‌ స్టేషన్‌ వలన జగనన్న (టిడ్కో)కాలనీ, రాజీవ్‌ గృహకల్ప, మార్కండేయ కాలనీ, మన్నెం వారి వీధి లతోపాటు ఆటోనగర్‌ లోని పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆయా ప్రాంత ప్రజలకు లోవోల్టెజీ సమస్య, విద్యుత్‌ అంతరాయాలు తొలగి నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో కరెంట్‌ కష్టాలు తీరనున్నాయి.

అన్ని అంగులతో రూపుదిద్దుకున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఈనెల 10న ప్రారంభోత్సవానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. తమ ప్రాంతాలలో కరెంటు కష్టాలు తీర్చడానికి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కేకు ఆయా ప్రాంతాల ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement