అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రముఖ హీరో మోటోకార్స్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఏథర్ విద్యుత్ స్కూటర్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధమౌతోంది. ఈమేరకు కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇ-మెబిలిటీకి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం ఆసక్తి చూపుతోంది. అదే క్రమంలో ఇంధన సామర్ధ్య చర్యల్లో దేశంలోనే ఏపీ రోల్ మోడల్‌గా నిలిచిన క్రమంలో సదరు సంస్థ ఏపీలో తమ యూనిట్ ఏర్పాటకు అసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈక్రమంలోనే రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలాలు ఉన్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు ఇప్పటికే ఒక నివేదిక అందించినట్లు తెలిసింది. రాయలసీమ ప్రాంతమైన అనంతపురంలో కియా కార్ల తయారీ సంస్థతోపాటు నెల్లూరులో శ్రీసిటీ ఉన్న నేపథ్యం ఒకవైపు, ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో పరిశ్రమలు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈసంస్థకు ప్రకాశం జిల్లాల్లో స్ధతం కేటాయిస్తే బాగుంటుందన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం చూపే స్థలం ఎక్కడ ఉండనుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
సింగిల్ విండోలో అనుమతులు..
పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులు మంజూరుచేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సదరు కంపెనీ యాజమాన్యానికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ ప్రతిపాదన ఏడాదిక్రితమే ప్రభుత్వం వద్దకు రాగా అది ఇప్పుడు కార్యరూపం దాల్చేందుకు మార్గం సుగుమమైంది. సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం, అవసరానికి సరిపడా నీరు, ఏర్పాటుకు సరిపడా స్థలం, 24/7 విద్యుత్ సరఫరా వంటి అంశాలు ఏపీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, దరఖాస్తు చేసుకున్న వారం నుండి 10 రోజుల్లో అనుమతికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ కూడా ఏపీలో ఏథర్ కంపెనీ ఏర్పాటుకు ఊతమిస్తున్నాయి. సరళతర పారిశ్రామిక విధానమే తమ ధ్యేమంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కూడా ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.