Friday, November 22, 2024

అసంపూర్తిగా ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు.. నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ

అమరావతి, ఆంధ్రప్రభ : గతంలో అసంపూర్ణంగా నిలిచిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు- చేయాలని నిర్ణయించింది. ఈమేరకు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు అభ్యర్ధులను ఎన్నుకోవడంతోపాటు- కో-ఆప్టెడ్‌ సభ్యుని ఎన్నికను జనవరి 30 లేదా అంతకు ముందుగానే చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ నామినేట్‌ చేసిన అధికారి ఈ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు నోటీసులు జారీ చేయనున్నారు.

- Advertisement -

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్‌లోని రామకుప్పం అధ్యక్షుని ఎన్నిక మరియు రామకుప్పం, అన్నమయ్య జిల్లా కలికిరి, పల్నాడు జిల్లా నరసరావుపేట ఉపాధ్యక్షుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. అలాగే మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. మండల ప్రజాపరిషత్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎస్‌ రాయవరం, పిడుగురాళ్ల, సంతమాగులూరు, ఆలూరు, విడపనకల్లు, చెన్నేకొత్తపల్లి మండల పరిషత్‌లలో ఎన్నిక నిర్వహించనున్నారు. ఇక ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి గార, జియ్యమ్మవలస, పాయకరావుపేట, సామలకోట, పెదకూరపాడు, వెంకాచలం, పూతలపట్టు-, ఎమ్మిగనూరు మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగనున్నాయి. కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికలకు సంబంధించి కోటవురట్ల, గంపలగూడెం, జలదంకి, చిల్లకూరు, చిత్తూరు, మద్దికెర తదితర ఎంపీపీల్లో ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడింది.

గ్రామపంచాయతీలకు గతంలో ఎన్నికలు పూర్తి కాని ఉప సర్పంచ్‌ల ఎన్నికకు కూడా నోటిఫికేషన్‌ వెలువడింది. ఫిబ్రవరి 3న ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీల్లో ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు- చేయనున్నారు. ఇందులో శ్యామయవలస, వూటపల్లి, రేఖవానిపాలెం, యర్రకొత్తపల్లె, నారాయణరెడ్డిపల్లి, శేషమాంబాపురం, గంగవరం, అక్కులగారిపల్లి సహా ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు- మరో 22 గ్రామ పంచాయతీలకు కూడా ఉప సర్పంచ్‌ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి దాచేపల్లి నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎన్నికను కూడా నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు- చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement