Friday, November 22, 2024

16న జరగనున్న ఎన్నిక, కోన‌సాగుతున్న ప్రచారం..

శ్రీకాకుళం,(ప్రభ న్యూస్‌) : జిల్లాలో ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లలో నిర్వహించిన పంచాయతీ, జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో వివిధ కారణాలవల్ల వాయిదాపడిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలకు, మున్సిపాలిటీలకు, ఎంపిటిసి, జెడ్పిటిసి పదవులకోసం ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్‌, వార్డు పదవులకు సం బందించి ఆదివారం పోలింగ్‌ జరగనుండగా, మున్సిపల్‌ ఎన్నికలకు ఈనెల 15వ తేదీ, ఎంపిటిసిలకు ఈనెల 16న ఎన్నికలు జరగనున్నాయి. అయితే జిల్లాలోని మూడు మున్సిపాలిటిలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, కోర్టులో కేసులు కారణంగా జరగడంలేదు. ఆదివారం నాడు జిల్లాలో పంచాయతీ, వార్డు సభ్యుల పదవులకోసం ఎన్నిక జరగుతుంది. జిల్లాలో 12 పంచాయతీలకు, 36 వార్డు సభ్యుల పదవులకోసం ఎన్నిక జరగనుండగా, నామినేషన్‌ల ఉపసంహరణ తరువాత ఆరు పంచాయతీలకు సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.

ప్రస్తుతం ఆదివారం నాడు ఆరు సర్పంచ్‌ పదవులు, 3 వార్డుల పదవులకు మాత్రమే ఎన్నికలు జరగనుంది. సర్పంచ్‌ పదవులకు సంబందించి బూర్జ మండలంలోని ఒవిపేట, శ్రీకాకుళం మండలంలోని పొన్నాం పంచాయతీ, రేగిడి మండలంలోని తోకవలవలస పంచాయతీ, కొత్తూరు మండలంలోని మెట్టూరు పంచాయతీ, పాలకొండ మండలంలోని బుక్కూరు పంచాయతీ, టెక్కలి మండలంలోని తేలెనీలాపురం పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇందుకోసం 18 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసారు. వార్డు పదవులకు సంబందించి జి.సిగడాం మండలంలోని బాతువ పంచాయతీలోని 9వ వార్డు, రేగిడి మండలం సంకిలి పంచాయతీలోని 6వ వార్డు, వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి పంచాయతీలోని 7వ వార్డులో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబందించి మొత్తం 9782 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

2020లో ఎంపిటిసి, జెడ్సిటిసి ఎన్నిక నిర్వహించినప్పుడు నామినేషన్‌ వేసిన తెలుగుదేశం అభ్యర్ధి మృతిచెందడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఎన్నిక నిలిచిపోయింది. ఆ ఎన్నికను ఇప్పుడు నిర్వహిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలంలో తెలుగుదేశం-వైకాపా పార్టీలు గత నాలుగైదు రోజులుగా హోరాహోరీ ప్రచారం నిర్వస్తూ ఇరు పార్టీలో నువ్వానేనా అన్నట్లు ఉన్నాయి. మొత్తం 38 జెడ్పిటిసి స్థానాలకు గాను ఏప్రిల్‌ లో 37 స్థానాలను వైకాపా కైవసం చేసుకుంది. అయితే హిరమండలం ఎన్నిక వాయిదాపడింది. ఇప్పుడు దీనిలో కూడా వైకాపా స్థానాన్ని కైవసం చేసుకుని మొత్తం క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. అయితే ఈ స్థానాన్ని ఏ విధంగానైనా గెలుచుకుని జిల్లాలో పార్టీ క్యాడర్‌కు కొంతమేరైనా దైర్యం ఇవ్వాలని టిడిపి నాయకులు ఈ ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను ఏప్రిల్‌ తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది.

అయితే ఇప్పుడు జరుగుతున్న జెడ్పిటిసి పదవికోసం టిడిపి గట్టిగా పోటీ ఇవ్వనుంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా పార్టీ తరపున గత రెండుమూడురోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ నేతలకు ఉత్సాహం కల్పిస్తున్నారు. ఈనెల 16వ తేదీన జెడ్పిటిసి ఎన్నిక జరగనుంది. అదే విధంగా జిల్లాలో ఎంపిటిసి స్థానాలకు సంబందించి 15 చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్టీ ప్రాతిపధికన జరగనున్న ఎన్నికవ్వడంతో టిడిపి-వైకాపా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈనెల 16వ తేదీన పోలింగ్‌ అనంతరం, 18వ తేదీన వీటి ఫలితాలు ప్రకటించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement