ఎపికి పయనమవుతున్న సెటిలర్స్
ఓటింగ్ కోసం స్వంత గ్రామాలకు పయనం
ఆర్టీసీ, రైళ్లు ఫుల్…స్పెషల్స్ లో సైతం నిండుగా జనం
దోపిడీకి తెరలేపిన ప్రైవేట్ ట్రావెల్స్
విజయవాడకే రెండు వేలు పై మాటే
స్లీపర్ అయితే అయిదు వేలు కట్టాల్సిందే
విశాఖలకు అయిదు వేలు, శ్రీకాకుళానికి ఏడు వేలు
ఇక కడప, కర్నూలు, చిత్తూరులకు పది రెట్ల వసూళ్లు
అందుబాటులోకి వచ్చిన విమాన సర్వీసులు
మరో రెండు వేల బస్సులు నడపనున్న ఆర్టీసీ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారానికి తెర పడనుంది. మరో రెండు రోజుల్లో అంటే మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో ప్రజలు సొంత ఊర్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిన జనాలు.. సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. నేటి నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు ఉండటంతో.. ఓటేయడం కోసం తమ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. దీంతో.. ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ. మామూలు రోజుల్లో సొంత ఊర్లకు వెళ్లాలంటే.. 500నుంచి వేయి రూపాయలు అవుతుంది. కానీ.. ఇప్పుడు మాత్రం ఏకంగా మూడు, నాలుగు రెట్లు పెంచేసాయి ప్రైవేట్ ట్రావెల్స్. అంటే.. వెయ్యి రూపాయలు అయ్యే చోట ఇప్పుడు ఏకంగా 5 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ కుటుంబం నుంచి ఇద్దరు ఊరికి వెళ్లి ఓటు వేసి రావాలంటే.. 10 నుంచి 15 వేలు ఖర్చవుతోంది.
ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు 2500 నుంచి 5 వేల వరకూ చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలాంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజులో టికెట్ రేట్లు ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రయాణీకులు సొంతూళ్లకు వెళ్తుండటంతో.. సిటీలోని అన్ని ప్రాంతాలూ బస్సులతో రద్దీగా మారాయి. బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
అదనంగా రెండు వేల ఆర్టీసీ బస్సులు..
మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలోఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటుచేసింది. దీంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది. ఇక ఆర్టీసి ప్రస్తుతం నడుపుతున్న బస్సులకు గాను అదనంగా రెండు వేల బస్సులను నాలుగు రోజుల పాటు నడపనున్నట్లు ప్రకటించింది..
అందుబాటులో విమానాలు
ఎపి వెళ్లే ప్రజల కోసం విమాన సంస్థలు తమ వంతు అదనపు సర్వీస్ లను నడుపుతున్నాయి.. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రిలకు విమానాలను అందుబాటులోకి తెచ్చాయి.. విజయవాడ, తిరుపతిలకు ఎనిమిది వేలు ఉండగా, విశాఖకు సైతం తొమ్మిది వేలు చార్జీలను వసూలు చేస్తున్నారు… ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు కేవలం గంట సమయం కావడంతో ఐటి ఉద్యోగుల అధిక సంఖ్యలో విమాన ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు..