ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటిఫికేషన్ జారీచేశారు. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు చొప్పున స్థానాలకు.. అనంత, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కో స్థానానికి నోటిఫికేషన్ ఇచ్చారు. నేటి నుంచి నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. ఈనెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 24న నామినేషన్ల పరిశీలన.. 26వ తేదీ ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబరు 10న ఎన్నికల పోలింగ్ జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కాగా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న ఓట్ల లెక్కించి.. అదే రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. నేటినుంచి ఆయా జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది.