మండే ఎండల్లో కూల్ బీర్‌తో చిల్ అవ్వాలనుకున్న మందు బాబులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్ షాపులు మూతపడనున్నాయి. ఏపీ, తెలంగాణలో మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు వైన్స్ షాపులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. మే 13న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్‌లను సైతం మూతపడనున్నాయి.
శనివారం సాయంత్రం నుంచే..
మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను బంద్ చేయనున్నారు. తిరిగి మే 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. ఓట్ల కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. కాగా, వరుస బంద్‌లు మందు బాబులకు షాకిస్తున్నాయి. గత నెలలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసేశారు. ఈ నెలలో వరుసగా రెండు రోజులు మూత పడనున్నాయి. అటు జూన్ 4న కౌంటింగ్ రోజున కూడా మూసివేయనున్నారు.
బీర్లు అమ్మడం లేదని కంప్లెయింట్..
రాష్ట్రంలో ఎండులు దంచికొడుతున్నాయి. వర్షాలతో రెండు రోజులు తగ్గిన భానుడి ప్రతాపం.. ఇప్పుడు మళ్లీ పెరిగింది. దీంతో.. మందుబాబులు వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో చిల్డ్ బీర్ లాగిస్తూ సేద తీరుతున్నారు. అయితే.. అవి కూడా తగినన్ని అందుబాటులో ఉండట్లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏకంగా ఒక వ్యక్తి 20 రోజుల నుంచి వైన్ షాపుల్లో లైట్ బీర్‌లను అమ్మడం లేదని.. ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చాడు.