New Delhi – లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఈసీ ఆదేశాలు పంపింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండకూడదన్న నిబంధనల మేరకు బదిలీలు, పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలివే..
నేరుగా ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఏ అధికారి కూడా సొంత జిల్లాలో ఉండకూడదు.
మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న లేదా 2024 జూన్ 30 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటున్న వారిని కొనసాగించకూడదు.
ప్రత్యామ్నాయాలు లేని చిన్న రాష్ట్రాల్లో మాత్రం సంబంధిత అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకురావాలి.
జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లాల ఉపఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వో, ఏఈఆర్వోలతో పాటు తహశీల్దార్‌లు, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారుల వరకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
మున్సిపల్ కార్పొరేషన్లు, డెవలప్‌మెంట్ అథారిటీలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయి నుంచి పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకూ ఈ నిబంధనలే వర్తింపజేయాలి.
.బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన నివేదికను 2024 జనవరి 31లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి