మన ఆస్తిని మనం రుజువు చేసుకోవాలా?
పట్టాదార్ పాస్ పుస్తకంపై రాజముద్ర వేయాలి
జగన్ ఫోటో వేయవచ్చా
డీఫారం పట్టాలనూ మింగేస్తారు
యువతకు ఉపాధి కల్పిస్తాం
రైతుకు సాగునీరు ఇస్తాం
వెల్దుర్తి సెంటర్ లో పవన్ కళ్యాణ్
( ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం ప్రతినిధి) – ‘‘ఆంధ్రప్రదేవ్ రాష్ట్రం పురోగతిలో పయనించాలంటే రైతులు బాగుండాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలి. ఇందుకు ఎన్డీయే కూటమి పని చేస్తుందని”జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోడ్ షోలో పాల్గొన్నారు. గ్రామగ్రామాన పవన్ కళ్యాణ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు పట్టారు. కుర్రకారు కేరింతలు కొట్టారు. ప్రతి గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ రోడ్ షో కోసం ప్రజలు ఎదురు చూశారు. పి.దొంతమూరు వెల్దుర్తి సెంటర్ లో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మన ఆస్తిపై జగన్ ఫోటో పెడతారా?
పట్టాదారుల పుస్తకాలపై జగన్ ఫోటోను ముద్రించడంపై జనసేనాని ఫైర్ అయ్యారు. మన భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర ఉండాలి గాని జగన్ ఫోటో ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘ఇక దస్తావేజులు ఉండవట అన్నీ సర్వర్ లో ఉంటాయట. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మన అందరి ఆస్తులుపోతాయి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా ఆస్తి అని మనం రుజువు చేసుకోవాలా’’ ఇదెక్కడి న్యాయం అంటూ విరుచుకుపడ్డారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకే దిక్కు లేనప్పుడు అసైన్డ్ డి ఫారం పట్టా భూములను వైసీపీ నాయకులు మిగులుస్తారా అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వానిన చెత్తబుట్టలో వేద్దాం..
ప్రభుత్వ ఆస్తులు, వనరులు అన్నింటిని సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి, ద్వారంపూడి లాంటి వైసీపీ నాయకులకు జగన్ పంచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి నిధులు లేవంటూ పంటలు ఎండబెడుతున్నారన్నారు. కనీసం డీజెలు ఖర్చులు కూడా భరించటం లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పురుషోత్తమ పట్నం రైతుల కోసం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని.. అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేద్దాం అంటూ పిలుపునిచ్చారు. ఏలేరు సుద్ధగడ్డ ఆధునీకరణ బాధ్యత తీసుకుంటాననిహామీ ఇచ్చారు.ఓట్లు చీలకూడదు. రాష్ట్రం బాగుండాలి అనే తాను కూటమిలో చేరానని చెప్పారు. ఎస్ఎన్ఎస్ వర్మ జనసేన కోసం త్యాగం చేశారని, సాధారణంగా పార్టీల్లో అంతర్గత గొడవలు సహజమని, కానీ వర్మ లాంటి వ్యక్తి మనకు ఎంతో అవసరమన్నారు. ‘‘మాకు అధికారం లేదు కానీ నాకు సైన్యం ఉంది. అన్యాయం జరిగితే మా సైన్యం ఊరుకోదు. ఈ దుష్ట పరిపాలనకు అంతం పలకాలి. రాష్ట్రం బాగుండాలంటే టీడీపీ,జనసేన కలిసి పని చేయాలి’’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.