ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత షర్మిల భుజాలపై పడింది. క్షేత్రస్థాయిలో అందరిని కలుపుకొని వెళుతున్నారు. పార్టీలోకి కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. యువతరం నేతలతో షర్మిల చర్చిస్తున్నారని తెలిసింది. వైఎస్ఆర్తో అనుబంధం గల నేతలతో కేవీపీ చర్చలు జరుపుతున్నారని సమాచారం. కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు.
ఈనెల 23వ తేదీన (మంగళవారం) శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభమవుతుంది. ఆ రోజున పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. ఆ మరునాడు విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు. 25వ తేదీన కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, 26వ తేదీన తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, 29వ తేదీన తిరుపతి, చిత్తూర్, అన్నమయ్య జిల్లా, 30వ తేదీన శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు, 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది.