Saturday, November 23, 2024

బుచ్చిరెడ్డిపాళం లో మొద‌లైన‌ ఎన్నిక ఎర్పాట్లు..

నెల్లూరు, ( ప్రభ న్యూస్‌): జిల్లాలో పలు కారణాల వలన వాయిదా పడుతూ ఎట్టకేలకు నోటిఫికేషన్‌ జారీ అయిన నెల్లూరు నగరపాలక సంస్థకు , తొలిసారి నగర పంచాయతీ అయిన బుచ్చిరెడ్డిపాళెంకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి శనివారంతో ప్రచార పర్వానికి తెర పడింది. గత 15 రోజులుగా ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమైన నాయకులు , అభ్యర్థులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రచార పర్వానికి తెర పడడంతో పాటు షరా మామూలే అన్నట్లుగా ప్రలోభాల పర్వానికి తెర లేచింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు పెద్దగా ప్రలోభాలకు పాల్పడలేదు. ప్రతి పక్ష పార్టీలు గెలుపు ధ్యేయంగా ముందుకు పోతూ ఓటర్లకు తాయిలాలు ఎర చూపుతున్నారు. అక్కడక్కడ అధికార పార్టీ అభ్యర్థులు కూడా చాటుమాటుగా ఓటర్లకు కానుకలు అందిస్తున్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి 54 డివిజన్లు ఉండగా 8 డివిజన్లు ఉప సంహరణ కార్యక్రమం నాటికి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 46 డివిజన్లకు సంబంధించి 208 మంది అభ్యర్థులు కార్పొరేటర్‌ పదవుల కోసం బరిలో ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం కొవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారమే జరగనుంది. దీంతో పోలింగ్‌ నాటికి తమ ఏజెంట్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్ల కోసం అభ్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు.

దీంతో పాటు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక నేడు జిల్లాలోని పలు పంచాయతీలకు సంబంధించి 6 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు నెల్లూరు నగర పాలక సంస్థకు , బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి ఎన్నికలు జరగనుండగా ఈ నెల 16వ తేదిన జిల్లాలో పలు కారణాల వలన పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌తో పాటు కౌంటింగ్‌లో పాల్గొనేందుకు ఏజెంట్లుగా నియమింపబడే వ్యక్తులు జాబితాను ఆయా పార్టీల అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement