అమరావతి, ఆంధ్రప్రభ : కరెంటు- బిల్లు రాగానే దానిలో ఉండే వివరాలు అర్ధంకాక, దేనికి ఎంత ఛార్జీ వేశారో తెలియక ఇన్నాళ్లు ఇబ్బందిపడ్డ వినియోగదారులకు ఇకపై ఆ సమస్య తొలగనుంది. పరిపాలనా వ్యవహారాల్లో తెలుగు భాషకు ప్రాధాన్యమివ్వడంతోపాటు- వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల వివరాలను స్పష్టంగా తెలియజేసేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో దశలవారీగా అన్ని డిస్కంలలోనూ పూర్తి తెలుగులో తెల్ల కాగితంపై స్పాట్‌లోనే ముద్రించిన బిల్లులు ఇస్తోంది. విద్యుత్ బిల్లుల్లో క్యూ ఆర్ కోడ్‌ను ఇవ్వడం ద్వారా బిల్లు చెల్లింపునకు సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 1.91 కోట్ల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి ప్రతి నెలా బిల్లులను దాదాపు 10 వేల మంది స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా వినియోగదారులుకు అందిస్తున్నాయి. గతంలో ఈ బిల్లులు తెల్లకాగితంపైనే ముద్రితమయ్యేవి.
స్పాట్ బిల్లింగ్ మిషన్లలో తెల్ల కాగితం బండిళ్లనే వినియోగించేవారు. ఆ తరువాత కాలంలో ప్రీ ప్రిం-టె-డ్ కాగితం అంటే ముందే తెలుగులో ముద్రించిన గులాబీ రంగు కాగితం బండిళ్లను వాడటం మొదలు పెట్టారు. అయితే, రీడర్లు ప్రీ ప్రిం-టె-డ్ పింక్ పేపర్ నాణ్యత విషయంలో రాజీ పడుతున్నారు. అంతేకాకుండా మిషన్లు కూడా అప్ డేట్‌గా ఉండటం లేదు. తరచుగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ముద్రితమవ్వాల్సిన చోట కాకుండా వేరే చోట ముద్రితమవుతుండటం, అక్షరాలు ఏమాత్రం అర్ధంకాకుండా, కనీసం కనిపించకుండా బిల్లులు రావడం జరుగుతోంది. అదీకాక కొత్తగా జరిగిన మార్పులు, వేస్తున్న ఛార్జీలు తెలుగులో కాకుండా ఇంగ్లీషులోనే ముద్రితమవుతున్నాయి.
క్షణాల్లో బిల్లుల చెల్లింపుకు అవకాశం
ఈ ఇబ్బందులను గమనించిన విద్యుత్ శాఖ బిల్లుల్లో పూర్తిస్థాయిలో తెలుగు భాషను ఉపయోగించడంతోపాటు- తెల్ల కాగితంపై మిషన్ నుండే అప్పటికప్పుడు బిల్లు ముద్రితమై వచ్చేలా డిస్కంల ఐటీ- విభాగం ద్వారా సాప్ట్n వేర్‌లో మార్పులు చేసింది. దానిని రీడర్లు తమ మిషన్లతో ఎక్కించుకుంటు-న్నారు. తెలుగులో బిల్లు రావడంతోపాటు- ఆ బిల్లుపై ఒక క్యూ ఆర్ కోడ్ కూడా వస్తుంది. డిజిటల్ చెల్లింపులకోసం ఇప్పుడు అన్ని చోట్లా ఇదే విధానాన్ని ఉపయోగిస్తున్నందున విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఈ సౌకర్యాన్ని తీసుకువస్తున్నారు. మొబైల్ ద్వారా బిల్లుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా బిల్లు చెల్లించే విండో (ఆప్షన్) తెరచుకుంటు-ంది. అక్కడే ఆన్‌లైన్ ద్వారా యూపీఐ, బ్యాంకు కార్డులతో క్షణాల్లో బిల్లులు చెల్లంచవచ్చు.
దశలవారీగా అన్ని డిస్కంలలో అమలు
ప్రీ ప్రిం-టె-డ్ పింక్ బిల్లుల స్థానంలో వైట్ పేపర్‌ను తెలుగు అక్షరాలతో మార్చి 1వ తేదీ నుండి వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు- చేయవలసిందిగా రీడర్లకు చెప్పాలని జిల్లాల్లోని ఎస్‌ఈలకు గతంలోనే ఆదేశాలిచ్చినట్లు ఏపీ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జే పద్మా జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పారు. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీ నుండి తాము తొలుత ఒక డివిజన్‌లో మొదలు పెట్టి ఆతరువాత 24 డివిజన్లకు విస్తరిస్తామని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ కే సంతోష్ రావు తెలిపారు. ప్రస్తుత బిల్లుల స్థానంలో కొత్త పద్దతిలో బిల్లులు త్వరలోనే వినియోగదారులకు అందిస్తామని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాథ రావు వివరించారు.