Friday, October 18, 2024

Amaravati | డ్రోన్‌ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు : సీఎస్‌ నీరబ్‌ కుమార్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 22,23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో నిర్వహించనున్న అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024 విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు డ్రోన్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్‌టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌లతో సీఎస్‌ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిీఎస్‌ మాట్లాడుతూ…

- Advertisement -

సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా పెద్ద ఎత్తున డ్రోన్‌ సమ్మిట్‌ ను నిర్వహిస్తున్నామన్నారు.

ఈరెండు రోజుల డ్రోన్‌ సమ్మిట్‌ ను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులు వెంటనే సదస్సు ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదస్సుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వరకు వక్తలు,ప్రతినిధులు పాల్గోనున్నారని, అలాగే మరో వెయ్యి మంది వరకూ వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు, విద్యార్ధులు, ప్రొపెషనల్స్‌, సాంకేతిక అభిలాషులు తదితరులు పాల్గొంటారని సీఎస్‌ పేర్కొన్నారు.

రెండు రోజుల డ్రోన్‌ సమ్మిట్‌ లో ప్రధానంగా డ్రోన్ల తయారీ, వ్యవసాయ, లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్లను వినియోగం అంశాలపై 9 సెషన్లు నిర్వహించడం జరుగుతుందని సీఎస్‌ పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్తులో డ్రోన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా తీర్చిదిద్దే అంశంపై ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటుందన్నారు.

అదే విధంగా దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీ దారులు వారి ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శన శాలలను వేదిక వద్ద ఏర్పాటు చేయనున్నారు. అలాగె డ్రోన్‌ డిమానిస్ట్రేష్రన్‌ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 2030 నాటికి భారత్‌ ను గ్లోబల్‌ డ్రోన్‌ హబ్‌ గా రూపొందించడం, డ్రోన్‌ రెగ్యులేషన్స్‌ పై ఫ్యానల్‌ డిస్కషన్స్‌ ఉంటాయని సీఎస్‌ చెప్పారు.

వ్యవసాయ, ఆరోగ్య,లాజస్టిక్‌ రంగాల్లో డ్రోన్ల వినియోగం,సర్వే సెటిల్మెంట్స్‌, భూ రికార్డులు, డిజిటల్‌ లాండ్‌ రికార్డులు తయారీలో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై ఫ్యానల్‌ డిస్కషన్స్‌ జరుగుతాయన్నారు. రెండు రోజుల అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024లో భాగంగా 22వ తేది సాయంత్రం 6 గం.ల నుండి రాత్రి 8గం.ల వరకూ విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ పార్కు వద్ద పలు సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించ నున్నామన్నారు.

డ్రోన్‌ సమ్మిట్‌ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి,పలువురు రాష్ట్ర మంత్రులు, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ట్రాల్రకు చెందిన ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నారని చెప్పారు. ఈసమ్మిట్‌ విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

డ్రోన్‌ సమ్మిట్‌ జరిగే ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను సిఎస్‌ ఆదేశించారు. వీడియో సమావేశానికి వర్చువల్‌ గా పాల్గొన్న ఐ అండ్‌ ఐ కార్యదర్శి ఎస్‌.సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈడ్రోన్‌ సమ్మిట్‌ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. వివిధ శాఖల నుండి 10 ప్రత్యేక నోడలు అధికారులను నియమించాలని ఆయా శాఖల కార్యదర్శులను కోరినట్టు తెలిపారు. సమావేశంలో ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ కె.దినేష్‌ కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024 కు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సిఎస్‌ కు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement