Friday, November 22, 2024

Ekadasi – ముక్కోటి ఏకాద‌శి రోజున‌ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు … భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్న వైష్ణ‌వాల‌యాలు ..

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎపి, తెలంగాణ‌లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.

తిరుమ‌ల గిరుల‌లో భ‌క్త జ‌న ప్ర‌భంజ‌నం

తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ల‌క్ష‌లాది భ‌క్తుల‌తో పాటు పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వారిలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ ఎస్‌.ఎల్‌. భట్టి, జస్టిస్‌ శ్యామ్‌ సుందర్‌, జస్టిస్‌ తారాల రాజశేఖర్‌, కర్ణాటక గవర్నర్‌ ధావర్‌ చంద్‌ గెహ్లాట్‌, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్‌, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్‌, ఉపసభాపతి వీరభద్ర స్వామి, తెదేపా నేత అచ్చన్నాయుడు ఉన్నారు. వారంతా ఉద‌యాన్ని ఉత్త‌ర ద్వారం ద్వారా దేవ‌దేవుడిని ద‌ర్శించుకున్నారు..

ఇక వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం 10 రోజుల పాటు టిటిడి క‌ల్పించింది.. తొలి రోజైన నేడు స్వామి ద‌ర్శ‌నాన్నికి కొండ‌పైకి ల‌క్ష‌కు పైగా భ‌క్తులు చేరుకున్నారు.. ముందుగా ద‌ర్శ‌న టోకెన్లు తీసుకున్న వారికి మాత్ర‌మే ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు.. క్యూ కాంప్లెక్ట్ లు నిండిపోగా, బ‌స్టాండ్ వ‌ర‌కూ భ‌క్తులు క్యూలైన్ లో ఉన్నారు.. కాగా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా అశేష భక్త జనం మధ్య తిరుమలేశుడు స్వర్ణరథంపై తిరుమల మాడవీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు.

- Advertisement -

మ‌హా విష్ణువు రూపంలో యాదాద్రీశ్వ‌రుడు ..

తెలంగాణాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజ గోపురం చెంత ఆలయ దేవుడు నారసింహుడు మహా విష్ణువు రూపంలో భక్త జనానికి దర్శనమిచ్చారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులతో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తుల నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి. ద‌ర్శ‌నానికి నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది.

ధ‌ర్మ‌పురిలో ముక్కంటికి మ‌హా క్షీరాభిషేకం ..

తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూర్ ఎమ్మేల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు పాల్గొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

కాగా, సంగారెడ్డి వైకుంఠపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన పల్లకి సేవలో మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు పాల్గొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సిరిసిల్లలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా గరుడవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు హరి హరులు దర్శనం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు.

రావ‌ణ వాహ‌నంలో ముక్కంటి…చూసి పుల‌కించిపోయిన భ‌క్త జ‌నం

శ్రీశైలం – ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీ భ్రమరాంబా సమేత మల్లి కార్జునస్వామివారు రావణ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయలోని ఉత్తర ద్వారం వద్ద ఉత్తర ముఖంగా స్వామి అమ్మవార్లను రావణ వాహనంపై ఆశీనులను చేసి అర్చకులు వేదపండితుల ప్రత్యేక పూజలు నిర్వహించి హరతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై ఆలయ ప్రదక్షిణ సాగుతుండగా భక్తులు భక్తి శ్రద్ధలతో రావణ వాహనంలో ఉన్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా, స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు వెల్లువెత్తారు..

కదిరిలో శ్రీదేవి, భూదేవిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని, శనివారం ఉత్తర గోపురం దర్శనం కై భక్తులు పోటెత్తారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కదిరి చుట్టుపక్కల గల మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు, అదేవిధంగా కర్ణాటక ప్రాంతం నుంచి భారీగా భక్తులు తరలిరావడం కనిపించింది. శనివారం తెల్లవారుజామున 3: 30 గంటల నుంచి భక్తులకు ఆలయం ఉత్తర గోపురం దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీవారిని, శ్రీదేవి, భూదేవి సమేతంగా విశేషంగా అలంకరించి ఉత్తర గోపురం కింద విశేష రీతిలో అలంకరించి, పల్లకిపై కూర్చోబెట్టారు. అనంత‌రం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement