Friday, November 22, 2024

రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి.. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులకు ఎంపీ జీవీఎల్‌ హామీ

అమరావతి, ఆంధ్రప్రభ: పాత్రికేయుల రైల్వేపాసుల పునరుద్ధరణకు తనవంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో మాట్లాడటంతో పాటు పాత్రికేయుల రైల్వే పాసులు పునరుద్ధరించాలంటూ లేఖ కూడా రాశారు. కొవిడ్‌-19 నేపధ్యంలో రెండేళ్లుగా రాయితీ పాసులను రైల్వేశాఖ ఆపేసింది. సీనియర్‌ సిటిజన్లు సహా అన్ని వర్గాలకు ఇచ్చే రాయితీ పాసులను ఆపారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌-19 నిబంధనలు ఎత్తేయడం, రైల్వేలో సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో రైల్వే పాసులు ఇవ్వాలంటూ పలువురు జర్నలిస్టులు అధికారులను కలిసి విన్నవించారు. అయితే రైల్వేశాఖ నుంచి ఆదేశాలు వస్తే ఇవ్వలేమని చెప్పిన నేపధ్యంలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు నేతృత్వంలో శనివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావును కలిసి వినతి పత్రం అందజేశారు.

దీనికి స్పందించిన జీవీఎల్‌ జర్నిలిస్టులు రైల్వేపాసుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటూ రైల్వేమంత్రిని కోరారు. ఈ మేరకు లేఖ కూడా పంపుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఢిల్లి వెళ్లిన తర్వాత కేంద్ర రైల్వేమంత్రి, రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ జీవీఎల్‌ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్‌ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఫోటో జర్నలిస్టు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement