రాయలసీమ, ప్రభన్యూస్ ప్రతినిధి, : రుతు పవనాల ఎఫెక్టుతో రాయలసీమలోని 234 మండలాల్లో భారీ వర్షం కురవగా, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రహదారులు కోతకు గురికాగా, కర్నూలు, కడప జిల్లాల్లో పిడుగుపాటుకి ముగ్గురు మృతి చెందారు. మే మాసంలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కడప జిల్లాలో సాధారణ వర్షపాతం 688.8 మి.మీ. కాగా, 1155.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అధికంగా 67.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ జిల్లా పరిధిలో 51 మండలాలుండగా అన్ని మండలాల్లోనూ సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 20 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో కడప నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి రాయచోటి జిల్లాలో 66 మండలాల్లో సాధారణ వర్షపాతం 915.8 మి.మీ కాగా 1445.8 మి.మీ వర్షపాతం కురిసింది. సాధారణం కన్నా 57.8 మి.మీ వర్షపాతం అధికంగా నమోదైంది.
66 మండలాల్లోనూ సాధారణం కన్నా అధికంగానే వర్షాలు కురిశాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి పది రోజుల ముందు వర్షాలు కురవడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 63 మండలాల్లో సాధారణ వర్షపాతం 535.3 మి.మీకు గాను 795.2 మి.మీ వర్షపాతం కురిసింది. అధికంగా 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో కురిసిన వర్షంతో అన్నదాతలు వేరుశనగ సాగుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా వాగులు, వంకలు, పొంగి పొర్లాయి. దాదాపు 10 రహదారులు కోతకు గురయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 మండలాల్లో 654.6 మిల్లిమీటర్లకు గాను 655 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ జిల్లా పరిధిలో కురిసిన వర్షాలకు హోలుగుంద, హాలర్వి మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. హాలర్వి నుండి గుల్లం వెళ్లే రహదారి కోతకు గురైంది. హోలగుంద మండలంలో పిడుగుపాటు శబ్ధానికి తండ్రి, కుమారుడు మృతి చెందారు.
ఈ ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు డోన్ మండలంలో సాధారణ వర్షపాతం కన్నా అధికంగా నమోదైంది. నందికొట్కూరు, మిడితూరు, గోనెగండ్ల, కృష్ణగిరి, కర్నూలు, కొసిగి, కల్లూరు, మహానంది, ఔకు, ఎమ్మిగనూరు, వెల్దుర్తి, వెలిగోడు, పాములపాడు, జూపాడు బంగ్లా, నందవరం, కొత్తపల్లి, బండి ఆత్మకూర్, పెద్ద కడుగూరు, కొలింబుండ్ల, ఆత్మకూరు, పాపిలి, గడివేముల, బనగానపల్లి, మంత్రాలయం, పంజామల, బేతంచర్ల, కోయిలకుంట్ల, పాణ్యం, తుక్కలి మండలాల పరిధిలో భారీవర్షం నమోదైంది. ఈ ఉమ్మడి జిల్లాలో సగటున ఒకేరోజు రికార్డు స్థాయిలో 20 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగుకు అందించే తుంగభద్ర జలాశయానికి వరదనీరు చేరుతోంది జలాశయం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో టిబి డ్యామ్ బోర్డు అధికారులు 61,189 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 19.776 టిఎంసిల నీరు నిల్వవుంది. జలాశయం పూర్తి నిలువ 100 టిఎంసిలు కాగా ప్రాజెక్టుకు వరదనీరు వస్తుండటంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతుల్లో ఆనందం నెలకొన్నది. భారీగా నీరు వస్తే తాగు, సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతుల్లో కొత్త ఆనందం నెలకొన్నది. ముఖ్యంగా సుంకేసుల జలాశయం నీటితో కళకళలాడుతోంది. తుంగభద్రా నది ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ఈ జలాశయానికి భారీగా వరదనీరు చేరింది. 19 వేల క్యూసెక్కులకు పైగా ఆదివారానికి చేరింది.
ఈ జలాశయం నీటి సామర్ధ్యం 1.20 టిఎంసిలు కాగా 19,900 క్యూసెక్కుల వరదనీటిని జలాశయ 5 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. కర్నూలు, కడప, కెసి కాలువకు 180 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం కర్నూలు నగరానికి విడుదల చేశారు. రాయలసీమలో ఈ మే మాసంలో 234 మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో సాధారణం కన్నా అధికంగా 70 మిల్లిమీటర్లు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో కూడా సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురిశాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..