అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టంనకు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతోవచ్చే 24 గంటల్లో అదే ప్రాంతములో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది .ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం తునిలో అత్యధికంగా 21 మి.మీ, నర్సాపూర్‌లో 6, కాకి నాడలో 3, మచిలీపట్నం, విశాఖపట్నంలో 2 మిమీ చొప్పున వర్షపాతం నమోదై ంది. కళింగపట్నం, బాపట్ల, అమరావతి ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.