Thursday, November 21, 2024

అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్న ప్ర‌భుత్వ విప్

అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హెచ్చరించారు. మంగళవారం కోటనందూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. డ్వాక్రా మహిళలు నుంచి మండలంలో ఆ శాఖకు సంబంధించిన వివోఏలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని, ఇదే విధానం కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా తీవ్రంగా హెచ్చరించారు. సిబ్బంది ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు సేవలు అందించడంలో ఉదాసీన వైఖరి అవలంబించిన, అవినీతి అక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పవన్నారు. విద్యుత్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివిధ గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో తమకుడి పట్టాలు ఇచ్చారని, పాస్ పుస్తకాలు ఇచ్చే విషయంలో రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని బొద్దవరం గ్రామ రైతులు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకురాగా, రైతులకు వీలైనంత త్వరగా పాస్ బుక్కులు ఇచ్చి ఏర్పాటు చేయాలని కోటనందూరు ఎమ్మార్వో సత్యనారాయణను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు సక్రమంగా అందేవిధంగా అధికారులు పని చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో కోటనందూరు మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్, లోవ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమా రావు, వైసీపీ నాయకులు గొర్లి రామచంద్ర రావు, గొర్లి అచ్చయ్య నాయుడు, చింతకాయల చినబాబు, తహసిల్దార్ సత్యనారాయణ, ఎండిఓ సుబ్రహ్మణ్య శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement