Sunday, November 3, 2024

రూ. 8 లక్షల విలువైన 5.3 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడలో విజిలెన్స్ శాఖ సోమవారం ఉదయం నిర్వహించిన దాడుల్లో 121 బస్తాల్లో తరలిస్తున్న సుమారు రూ.8.12 లక్షల విలువైన 5.30 టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. మండపేట ఎంఎస్ఓ సుబ్బరాజు కథనం ప్రకారం మండలంలోని నర్శిపూడికి చెందిన బియ్యం వ్యాపారి పసలపూడి గంగరాజు ఆదేశాలు మేరకు అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజోలు మండలంలోని మునికిపల్లిలో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని లోడు చేసుకుని బయలు దేరాడు. అయితే ఆ బియ్యాన్ని ఎక్కడ దిగుమతి చేయాలో డ్రైవర్ కు వ్యాపారి గంగరాజు మాత్రం చెప్పలేదు. జొన్నాడ చేరుకున్న తరువాత ఫోన్ చేస్తే దిగుమతి చేసే ప్రాంతం చెబుతానని మాత్రమే తెలిపాడు.
దీంతో డ్రైవర్ స్థానిక బస్టాండ్ జంక్షన్ కు వచ్చి వాహనాన్ని ఆపి ఫోన్ చేస్తున్నాడు. ముందస్తుగా వచ్చిన సమాచారంతో జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఆదేశాలు మేరకు ఆసమయంలో విజిలెన్స్ సిఐ టి.శ్రీనివాస్, తహసీల్దార్ ఐపి.శెట్టి ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడి చేసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ బియ్యాన్ని ఏంఎస్ఓ సుబ్బరాజు మండపేటలోని గోదాముకు తరలించారు. బియ్యం రవాణా చేస్తున్న వేన్ ను సీజ్ చేసి ఆలమూరు పోలీసులకు అప్పగించారు. బియ్యం రవాణా వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ను అరెస్ట్ చేసి అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగరాజు పై కేసు నమోదు చేశారు. ఈమేరకు ఎస్ఐ శివ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement