కాకినాడ, ఆంధ్రప్రభ: ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి పేరిట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో జరుపుతున్న పర్యటనపై శుక్రవారం పోలీసులు ఆంక్షలు విధించారు. శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కొంత సేపు, ఈ పర్యటనకు ముందస్తు అనుమతుల్లేవని మరికొంత సేపు చంద్రబాబును పోలీసులు నిలువరించారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి ఈ పర్యటన సాగుతోంది. అయితే తొలి రెండ్రోజులు ఎలాంటి అడ్డంకుల్లేకుండా చంద్రబాబు పర్యటనను ముగించారు. మూడోరోజు మాత్రం పోలీసులు ఆయనకు అడుగడుగునా అడ్డంపడ్డారు. ఆయన వాహన శ్రేణిని ముందుకు కదలనివ్వలేదు. అలాగే అనుమతుల్లేకుండా అనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు వీల్లేద ంటూ పోలీసులు తేల్చిచెప్పేశారు. ఆయన వాహనాన్ని అడ్డగించారు. ముందుకు కదలనివ్వలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనంపై నుంచి దిగి కాలినడక ప్రారంభించారు. సుమారు ఏడు కిలోమీటర్ల పొడవునా ఆయన నడుచుకుంటూ అనపర్తి చేరుకున్నారు.
శుక్రవారం ఉదయం చంద్రబాబు సామర్లకోట నుంచి తన యాత్ర మొదలెట్టారు. వేట్లపాలెం వద్ద దివంగత బొడ్డు భాస్కర రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పట్నుంచి పోలీసులు ఆయనకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. బిక్కవోలు దాటిన తర్వాత ఆర్‌ఎస్‌పేట వద్ద పోలీసులు రోడ్‌కడ్డంగా పెద్ద సంఖ్యలో బారికేడ్లు పెట్టారు. వందల సంఖ్యలో పోలీసులు మోహ రించారు. అయితే తెలుగుదేశం శ్రేణులు వాటిని నెట్టుకుం టూ ముందుకు దూసుకుపోయారు. ఈ దశలో బలభద్రపురం సాయి బాబా ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న ఇసుకలారీల్ని ఆపి రోడ్డుకడ్డంగా పోలీసులు నిలబెట్టారు. దీంతో చంద్రబాబు వాహన శ్రేణి నిల్చిపోయింది. పోలీసులపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు. తాము ముందస్తు అనుమతులు పొందామంటూ వాదించారు. అయినా పోలీసులు పట్టు వీడలేదు. ముందుకెళ్ళేందుకు వీల్లేదంటూ అడ్డ గించారు. ఈ దశలో చంద్రబాబు తన వాహనాన్ని దిగి ముందుకెళ్ళారు. అప్పుడు కూడా ఆయన్ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు భద్రతగా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమెండోలతో పాటు పార్టీ శ్రేములు పోలీసుల్ని పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో పలువురుకి తీవ్రగాయాలయ్యాయి. చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే క్రమంలోని ఓ కానిస్టేబుల్ చేతిలోని తుపాకీ కూడా మాయమైంది. అయితే తుపాకీ మాయమైన సంఘటనను పోలీసులు ధ్రువీకరించలేదు.
పోలీసుల్ని నెట్టుకుని చంద్రబాబు నడుస్తూనే ఏడుకిలోమీటర్ల పొడవునా ముందుకు సాగారు. చంద్రబాబును పోలీసులు అడ్డగించారన్న వార్త దావానంలా వ్యాపించింది. దీంతో అంతకంతకు జనప్రవాహం పెరిగింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులతోపాటు పలువురు తటస్తులు కూడా నడుస్తున్న చంద్రబాబును చూసేందుకు పోటెత్తారు. దీంతో అనపర్తికి దారితీసే రహదారి జన సముద్రాన్ని తలపించింది. సుమారు రెండున్నర గంటలకు పైగా ఈ నడక సాగింది. రాత్రి నిర్ణీత సమయానికి కొన్ని గంటల ఆలస్యంగా ఆయన అనపర్తి చేరుకున్నారు. దేవీచౌక్‌లో ప్రసంగించేందుకు ఉపక్రమించారు. మరోసారి పోలీసులు ఆయనకు అడ్డంకులు సృష్టించారు. అక్కడ ప్రసంగానికి అనుమతిలేదంటూ తేల్చిచెప్పారు. ఏదైనా ప్రైవేటు స్థలంలో సమావేశం పెట్టుకోవాలని సూచించారు. అయితే తాను అక్కడే ప్రజలనుద్దేశించి మాట్లాడతానంటూ చంద్రబాబు నిర్ద్వందంగా తేల్చిచెప్పేశారు. కాగా ఆయన రోజూ వినియోగించే వాహనం మాత్రం అందుబాటులో లేకపోయింది. పోలీసులు అడ్డగించిన ప్రాంతం నుంచి ఆ వాహనం ముందుకురాలేక పోయింది. దారిపొడవునా జనం అడ్డంకావడంతో మధ్యలో ఇరుక్కుపోయిం ది. ఈ దశలో ఒక మహేంద్ర వాహనాన్ని పార్టీ నాయకులు సిద్దం చేశారు. దానిపైకి ఓ సాధారణ నిచ్చెన ద్వారా చేరుకుని చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు.
ప్రసంగం మొదలయ్యే సరికే మొత్తం విద్యుత్ సరఫరా నిల్చిపోయింది. పరిస్థితిని ముందే ఊహించిన పార్టీ నాయకత్వం ముందస్తుగా ఓ జనరేటర్‌ను సిద్ధం చేసింది. విద్యుత్ సరఫరా నిల్చినవెంటనే జనరేటర్ ఆన్‌చేసేందుకు నాయకులు ప్రయత్నిం చారు. అప్పటికే జనరేటర్ ఆపరేటర్‌ను పోలీసులు ఎత్తుకుపోయారు. దీంతో ఆ జనరేటర్‌ను ఎలా వినియోగించాలో అర్థం కాలేదు. ఈ దశలో సమీపంలోని ఓ దుకాణదారుడి నుంచి నాలుగుదు బల్బులకు సరిపడే విద్యుత్‌ను ఓ వైరు ద్వారా లాగారు. ఆ విద్యుత్ వెలుగులోనే చంద్రబాబు తన హ్యాండ్ మైక్‌తో ప్రసంగించారు. కాగా విచ్చేసిన కార్యకర్తలు, అభిమానులు తమ సెల్‌ఫోన్‌ల లైట్లను ఆన్‌చేశారు. ఆ వెలుగులోనే చంద్రబాబు తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.