జగ్గంపేట : నియోజకవర్గం పరిధిలోని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాలలోని పలు గ్రామాలలో పండుగ పర్వదినాలను పురస్కరించుకుని పేకాట, గుండాట, అశ్లీల నృత్యాలు వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గంపేట సిఐ సురేష్ బాబు హెచ్చరించారు.గండేపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్ పి రవీంద్ర బాబు ఆదేశాల మేరకు నవంబరు, డిసెంబరు ,జనవరి నెలలో పలు గ్రామాలలో అమ్మవారి జాతరలు,వివిధ పండుగలు నిర్వహిస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన కమిటీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సురేష్ బాబు చెప్పారు.
ఇటీవల కాలంలో యువత ప్రధానంగా మాదకద్రవ్యాలను వినియోగించి పెడదారి పడుతున్నారని తద్వారా వారి పై ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులను మోసగించడమే కాకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సూచించారు. యువత మాదకద్రవ్యాలను వినియోగించి అవసరాలను తీర్చుకునేందుకు పలు దొంగతనాలకు పాల్పడుతున్నారని ఈ మధ్య కాలంలో కొన్ని కేసులలో ఎక్కువగా యువతను అరెస్టు చేయవలసి వచ్చిందన్నారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తమ పిల్లల ప్రవర్తనా తీరు పై దృష్టి సారించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily