Friday, October 18, 2024

AP | 8కిలోమీటర్లు డోలి మోసినా.. దక్కని ప్రాణాలు

మారేడుమిల్లి, అక్టోబర్ 14 (ఆంధ్రప్రభ ) : స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడిచినా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం శూన్యమని నొక్కి వక్కాణించవచ్చు. ఆధునిక యుగంలో అనేకమైన హంగులు, ఆర్భాటాలతో కొనసాగుతుంటే గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేక‌ గిరిజన ప్రాణాలు హరీమంటున్న సందర్భాలు కోకొల్లలు. అల్లూరి జిల్లా పింజరికొండ ఘటన మరువక ముందే మరో గిరిజనుడి ప్రాణాలను డోలి మోత బలిగొన్నది. సోమవారం ఉదయం మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు పంచాయతీ నూరుపూడి గ్రామస్తుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఎన్నో ప్రభుత్వాలు మారినా గిరిజనులకు డోలి తిప్పలు తప్పడం లేదు.

తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న కేచ్చల తమ్మిరెడ్డి అనే గిరిజనుడిని డోలిపై 8 కిలోమీటర్లు గ్రామస్తుల సహాయంతో కుటుంబ సభ్యులు మోసుకొచ్చారు. ప్రాణాలు కాపాడేందుకు డోలిపై ఉదయం నుండి అతి కష్టం మీద సున్నంపాడు మోసుకొచ్చినా గిరిజనుడి ప్రాణం దక్కలేదు. రహదారి సౌకర్యం లేక, మరో ప్రక్క కొండవాగుపై వంతెన లేక అత్యవసర సమయంలో అంబులెన్సు వచ్చే వీలు లేకపోవడంతో సుమారు 8 కిలోమీటర్లు డోలిపైనే గ్రామస్తులు మోసుకొచ్చారు.

వాగులపై వంతెన లేకపోవడంతో డోలిపై మోసేందుకు సమయం పట్టడంతో నొప్పి బాధను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడంటూ గ్రామస్తులు ఆందోళన చెందారు. ఇప్పటికైనా ఏజెన్సీలో డోలి కష్టాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సున్నంపాడు పంచాయతీ గిరిజనులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement