Tuesday, November 26, 2024

ఏప్రిల్ 1నుంచి తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు.. భక్తులకు అనుమతి..

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవ‌లు తిరిగి ప్రారంభించి.. భ‌క్తుల‌ను అనుమ‌తించాల‌ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణ‌యించింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, అభిషేకం, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార వంటి సేవ‌లు నిర్వహించనున్నారు. కాగా, కొవిడ్‌-19 ప‌రిస్థితుల ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొన‌సాగుతుందని టీటీడీ తెలిపింది.

అదేవిధంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలకు సంబంధించి భ‌క్తులు నేరుగా పాల్గొనే విధానంతోపాటు వ‌ర్చువ‌ల్ విధానం కూడా కొన‌సాగుతుంది. వ‌ర్చువ‌ల్ సేవ‌ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు ఆయా సేవ‌ల్లో నేరుగా పాల్గొనే అవ‌కాశం లేదు. వారికి ద‌ర్శ‌నం క‌ల్పించ‌డంతోపాటు ప్ర‌సాదాలు అందించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవ‌లను బుక్ చేసుకున్న వారిని, ఉద‌యాస్త‌మాన సేవ, వింశ‌తి వ‌ర్ష ద‌ర్శిని సేవ‌లు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కొవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఆయా సేవ‌ల‌కు అనుమతించనున్నట్టు టీటీడీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement