Saturday, November 23, 2024

ఎప్‌సెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. ఏప్రిల్‌ 11న నోటిఫికేషన్‌, జులై 4 నుంచి పరీక్షలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌ , అగ్రికల్చర్‌ , ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌కు తేదీలు ఖరారయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ బుధవారం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. జూలై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఎప్‌సెట్‌ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జూలై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్‌, ఫార్మసీ , 11,12 తేదీల్లో అగ్రికల్చర్‌ ఎప్‌సెట్‌ సెట్‌ పరీక్షల్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. అందులో దరఖాస్తు తేదీలు, ఫీజుల పూర్తి వివరాలు ఉంటాయని మంత్రి వివరించారు.

ఆగస్ట్‌ లో ఎప్‌సెట్‌ ఫలితాలను వెల్లడిస్తామని, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో 136 సెంటర్లలో పరీక్షలు నిర్వహించామని, అవసరం మేరకు కేంద్రాల సంఖ్యను పెంపుదల చేస్తామన్నారు. తెలంగాణలో నాలుగు కేంద్రల్లో పరీక్షల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దఫా ఇంటర్‌కంటే ముందే పదో తరగతి పరీక్షల్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మే 6 నుంచి మొదలై 24తో ఇంటర్‌ పరీక్షలు ముగుస్తాయన్నారు. జూన్‌ 13తో సీబీఎస్‌ఈ పరీక్షలు పూర్తవుతాయన్నారు. ఎక్కడా కూడా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఎప్‌సెట్‌ షెడ్యూల్‌ ఖరారు చేయడం జరిగిందన్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement