Friday, November 22, 2024

AP: ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలి.. ఎంపీ రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, అక్టోబర్ 17 (ప్రభ న్యూస్): రాష్ట్రంలో ఎంసెట్ 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఎంపీ కింజరాపు రామ్మోహన్ తప్పుబట్టారు. వేలాది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన అంశంపై మీనమేషాలు లెక్కించడం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇందులో… ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఎంసెట్ రాస్తుంటారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది అర్ధాంతరంగా 2 కౌన్సెలింగ్ లకే పరిమితం చేయడం బాధాకరమన్నారు.

తమకు నచ్చిన కళాశాలలో సీటు, ఎంచుకున్న కోర్సు రాలేదని.. చాలా మంది 2, 3 కౌన్సెలింగ్ ల వరకు వెళ్తుంటారని తెలిపారు. కానీ.. విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. 3వ కౌన్సెలింగ్ రద్దు చేసి, స్పాట్ అడ్మిషన్లకు మాత్రమే అనుమతిస్తామని చెప్పడం సరికాదన్నారు. ఇది కేవలం కళాశాలల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చేది మినహా.. విద్యార్థులకు కాదని మండిపడ్డారు. దీనిపై విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యామండలి కమిషన్ చైర్మన్ సైతం 3వ విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, తప్పడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దీంతో ఎంతోమంది విద్యార్థులు మనస్తాపం చెంది, ఆత్మహత్యకు ప్రయత్నించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు.. తొందరపాటు నిర్ణయాలు, అధైర్యం వద్దని, సోదరుడిలా అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇప్పటికైనా స్పందించి, వెంటనే ఎంసెట్ 3వ కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించి, విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement